స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కోరారు. వారి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర్య స్ఫూర్తి అనేది ఓ జ్ఞాపకం కాదు. మనల్ని ముందుకు నడిపించే ఒక దిక్సూచి. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తి మన నిత్య జీవన గమనానికి ఒక పాఠం.. మాతృ దేశ అభివృద్ధి కోసం మనం ఎంతగా తపించాలో చెప్పే ఒక మంత్రం. ఈ స్ఫూర్తి ప్రతి ఇంటా నింపాలన్న సదుద్దేశంతోనే గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైనా మన జాతీయ పతకాన్ని ఎగురవేసి వందనం సమర్పిద్దాము. తిరంగా వేడుకలు గ్రామగ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకుందాము. అందుకే పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన విధంగా నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించండి. మనకు స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనులను స్మరించుకోండి అని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.