అధికారులు వైసీపీ నాయకుల్ని సమర్థించే పనులు మానుకోవాలి

• జనసేన నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు
• ముష్టి ఓటు కోసం ఈమని ఎంపీటీసీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు
• నెల్లూరు కోర్టులో చోరీ కేసు మాదిరి కథలు అల్లి కేసులు బనాయించారు
• నామినేషన్ నుంచి ఎంపీపీ ఎన్నిక వరకు వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది
• అధికారులు వైసీపీకి వత్తాసుపలికి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు
• సామాన్యుల్ని ఇబ్బందులు పెడితే జనసేన రోడ్డెక్కుతుంది
• ఈమని ఎంపీటీసీ, కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

పాలకపక్ష నాయకులు తొందరపడి తీసుకునే నిర్ణయాలకు వత్తాసు పలికి పోలీస్ శాఖ జనసేన నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతోందని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు, కార్యకర్తలకు కులపరమైన ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. పదవుల్లోకి వచ్చే ముందు రాగద్వేషాలకు అతీతంగా, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు.. పదవులు వచ్చాక అవి ఎందుకు గుర్తుకు రావని ప్రశ్నించారు. యంత్రాంగం వైసీపీ నాయకుల్ని సమర్థించే విధంగా పని చేసి సామాన్యులను ఇబ్బందిపెడితే రోడ్డెక్కుతామని హెచ్చరించారు. శుక్రవారం ప్రభుత్వ వేధింపులతో కేసులు ఎదుర్కొంటున్న మంగళగిరి నియోజకవర్గం, ఈమని ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి సాయి చైతన్య భర్త పసుపులేటి శ్రీనివాసరావును ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. దుగ్గిరాల మండల జనసేన అధ్యక్షుడిగా ఉన్న పసుపులేటి శ్రీనివాసరావుపై బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయపరంగా పార్టీ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “శ్రీనివాసరావు గారి మీద నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రజాస్వామికంగా, సమాజంలో ఎవరూ ఊహించని విధంగా వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేశారు. చివరికి మండలాధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు అనేక రకాలుగా కక్షపూరితంగా వ్యవహరించారు. శ్రీనివాసరావు వ్యవహారంలో ఈ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు, నాయకులు చేస్తున్న పనులు సమాజంలో ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయి. కష్టపడి చిన్న వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాన్ని ఓటు వేయాలన్న ఉద్దేశ్యంతో ఇబ్బంది పెట్టారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసులాగా కట్టుకధలు అల్లి, కొత్త కేసులు సృష్టించారు. పెట్రోల్ బంకులో ఎవరో పెట్రోల్ పోసుకువచ్చారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండుకు పంపడం ఎంత పొరపాటో ఆలోచించండి. శ్రీనివాసరావు విషయంలో ఇది నూటికి నూరు పాళ్లు బనాయించిన కేసన్న విషయం వాళ్లు రాసిన ఎఫ్ఐఆర్ చూస్తే అర్ధం అవుతుంది. ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించారో అర్ధం అవుతోంది. తన కాళ్ల మీద తను నిలబడిన వ్యక్తిని ముష్టి ఓటు కోసం, మండలాధ్యక్ష పదవి కోసం ఇంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారు కులమతాలకతీతంగా రాజకీయ ప్రస్థానం సాగించాలన్న మూల సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని జనసేన పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలను కేవలం కులపరంగా విడగొట్టే ధోరణితో వ్యవహరించడం బాధాకరం. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఈ తరహాలో అనేక విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. సంబంధం లేని కేసుల్లో మా కార్యకర్తలను ఇరికిస్తున్నారు. ఓసీ రైతులు, కాపులు అంటే అస్సలు సాయం అందడం లేదు. ఈ విధమైన పరిస్థితుల మధ్య సమాజంలో అందర్నీ ఒకే విధంగా ఏ విధంగా చూడగలరు. ఇది చాలా పొరపాటు. సమాజంలో ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉంది. 30 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలి. రాజకీయ నాయకులు తొందరపడి తీసుకునే నిర్ణయాలకు వత్తాసు పలికి మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బందిపెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని మీకు గుర్తు చేస్తున్నా ఇటువంటి పొరపాట్లు ప్రభుత్వ అధికారులు చేయరాదు. మూడు సంవత్సరాల కాలం అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటినుంచైనా వైసీపీ ప్రభుత్వాన్ని, నాయకుల్ని సమర్ధించే పనులు మానుకోండి. నిజాయితీగా పని చేయండి. సామాన్యులను ఇబ్బంది పెట్టకండి. ఇదే పరిస్థితులు కొనసాగితే మేమూ రోడ్డెక్కాల్సి వస్తుంది. అప్పుడు మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంద”న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.