కారణజన్ముడు ‘షహీద్ భగత్ సింగ్’

మరణించినా జీవించి ఉండేవారిని కారణజన్ములు అంటారు. అటువంటి కారణజన్ముడే ‘షహీద్ భగత్ సింగ్’. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి యుక్త వయస్సులోనే ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టిన ఆ మహావీరుని జయంతి సందర్భంగా ఆ తేజోమూర్తికి నీరాజనాలు అర్పిస్త్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భగత్ సింగ్ మన మధ్య భౌతికంగా లేకపోచ్చు.. కానీ ఆయన స్ఫూర్తి భారతీయుల గుండెల్లో పదిలంగా నిక్షిప్తమై వుంది. పిన్న వయస్సులోనే ప్రపంచ ఉద్యమాల చరిత్రను ఔపోసన పట్టి ‘విప్లవం వర్ధిల్లాలి’అనే నినాదాన్ని దేశానికి పరిచయం చేసిన విప్లవ వీరుడాయన. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి 23 ఏళ్ల వయస్సులోనే ఉరి కంబాన్ని ముద్దాడిన ఈ దేశభక్తుని వీర మరణం వృథా కాలేదు… ఎందరో యువకులు పోరుబాట పట్టారు. జాతికి విముక్తి కలిగించారు. భగత్ సింగ్ ఆచరించిన సామ్యవాద స్పూర్తితో జనసేన ప్రస్థానం అజరామరంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ ఆ అమరజీవికి వందనాలు అర్పిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు.