చిందేపల్లి రోడ్డు సమస్యను తక్షణం పరిష్కరించాలి

* ఆర్ అండ్ బి రోడ్డు రికార్డుల నుంచి ఎలా మాయమైంది?
ప్రభుత్వ వ్యవస్థలను అచేతనంగా మార్చేస్తే జరిగే అనర్థాలు ఏమిటో తెలియాలంటే చిందేపల్లి గ్రామంలో రహదారి సమస్యే ఉదాహరణ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. గ్రామస్తుల రోడ్డును ఓ కార్పొరేట్ కంపెనీ మూసి వేసి ప్రజలకు ప్రవేశం లేదని హుకుం జారీ చేస్తే జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. అదేమిటంటే ఆ రోడ్డు రెవెన్యూ రికార్డులలో లేదని చేతులు దులుపుకుంటున్నారు. ఆర్. అండ్ బి. పరిధిలోకి వెళ్ళిన రోడ్డు రికార్డుల నుంచి ఎలా మాయమైంది? ఈ రోడ్డు మూయవద్దన్న జనసేన నాయకులు, గ్రామస్తులపై పోలీస్ కేసులు పెడుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని చిందేపల్లి గ్రామస్తులు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడానికి ఉపయోగపడే ఈ రహదారి మూసివేయడంవల్ల గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరడంతో జనసేన శ్రీకాళహస్తి ఇంచార్జి శ్రీమతి వినుత కోటతోపాటు ఇతర నాయకులు వారికి అండగా నిలబడ్డారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగారు. న్యాయం చేయమని కోరినందుకు వారిని అరెస్ట్ చేయడంతోపాటు మొరటుగా ప్రవర్తించారు. చివరికి శాంతియుతంగా గ్రామస్తులతో కలసి నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో ఉన్నవారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అందువల్ల ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. ఈ ఆందోళన మరింత తీవ్రం కాకుండా చూడవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. పోలీసులు పెట్టిన కేసులను తక్షణం ఎత్తివేయాలి. దీక్ష చేస్తున్న వారందరికీ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.