యాప్ హాజ‌రు… టీచ‌ర్లు బేజారు!

* జ‌గ‌న్ స‌ర్కారు కొత్త విధానంపై నిర‌స‌న‌
* ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల ఆందోళ‌న‌
* పాఠ‌శాల‌ల్లో బోధ‌న జ‌ర‌గ‌ని ప‌రిస్థితి
* అనాలోచిత నిర్ణ‌యం ఫ‌లితం

సాధార‌ణంగా ఎక్క‌డైనా పాఠ‌శాల ప్రారంభం కాగానే ఏం జ‌రుగుతుంది?
టీచర్లు త‌ర‌గ‌తి గ‌దుల్లోకి వ‌స్తారు…
హాజ‌రు తీసుకుంటారు…
పాఠాలు చెబుతారు…
కానీ ఆంధ్రాలో మాత్రం ప్ర‌స్తుతం అలా జ‌ర‌గ‌డం లేదు!
టీచ‌ర్లు రాగానే జేబులోంచి సెల్‌ఫోన్ తీస్తున్నారు…
అందులో సెల్ఫీ తీసుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు…
సిగ్న‌ల్ అంద‌క‌పోతే క్లాస్ బ‌య‌ట తిర‌గుతున్నారు…
పిల్ల‌లు అయోమ‌యంగా చూస్తున్నారు…
చాలా చోట్ల త‌ర‌గ‌తులు ఆల‌స్య‌మ‌వుతున్నాయి…
బోధ‌న కూడా స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు…
కొన్ని చోట్ల స్కూలుకి వ‌చ్చిన టీచ‌ర్లు కూడా నేనివాళ సెల‌వు… అని ప్ర‌క‌టించి వెళ్లిపోతున్నారు…
హెడ్మాస్ట‌ర్లు కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు…
పిల్ల‌లు మాత్రం తెల్ల‌బోతున్నారు…
ఇదేంటి? ఇలా ఎందుకు జ‌రుగుతోంది?
బడుల్లో వాతావ‌ర‌ణం ఇంతలా ఎందుకు దిగ‌జారింది?
క్లాసుల్లో పాఠాలు క‌దా జ‌ర‌గాలి?
కానీ అవే ఆల‌స్యం కావ‌డం ఏమిటి?
ఈ ప్రశ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే ఆంధ్రాలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్రారంభించిన ఓ కొత్త నిర్ణ‌యం ఏమిటో తెలియాలి.
ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లోని ఉపాధ్యాయులు త‌మ‌ హాజ‌రును త‌మ సెల్‌ఫోన్ల ద్వారా ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌నేదే ఆ కొత్త నిర్ణ‌యం!
ఈ నిర్ణ‌య‌మే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షా 90 వేల మంది ఉపాధ్యాయుల‌ను ఆవేద‌న‌కు గురి చేస్తోంది. వారిని ఆందోళ‌న బాట ప‌ట్టిస్తోంది. క్లాసులో పాఠాలు చెప్పాల్సిన వారిని నిర‌స‌న ప్రద‌ర్శ‌న‌ల‌కు ప్రేరేపిస్తోంది. మూకుమ్మ‌డిగా ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌డానికి ఉసిగొలుపుతోంది.
ఆఖ‌రికి ఈ కొత్త నిర్ణ‌య‌మే… రాష్ట్ర వ్యాప్తంగా బ‌డి వాతావ‌ర‌ణాన్నే అయోమ‌య స్థితిలోకి నెట్టేసింది.
*అనాలోచిత‌ నిర్ణ‌యంతో అంత‌టా అయోమ‌యం!
ఏదైనా ఒక నిర్ణ‌యాన్ని తీసుకునేప్పుడు సంబంధిత వ‌ర్గాల‌తో చ‌ర్చించడం…
దాని సాధ్యాసాధ్యాల‌ను కూలంషంగా అంచ‌నా వేయ‌డం…
మొద‌ట‌గా కొద్ది రోజులు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌డం…
ఆ స‌మ‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు ఆలోచించ‌డం…
క్షేత్ర స్థాయిలో ఉత్ప‌న్న‌మ్యే అవ‌రోధాల‌ను ఊహించ‌డం…
వాటిని అధిగ‌మించేలా ప‌క‌డ్బందీగా తీర్చిదిద్ద‌డం…
ఇవేమీ లేకుండా ఏ నిర్ణ‌యాన్ని తీసుకున్నా అది బెడిసి కొడుతుంద‌న‌డానికి… టీచ‌ర్ల హాజ‌రును ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌నే అంశ‌మే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణ‌యం… ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీచ‌ర్ల‌కు, విద్యాధికారుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది.
ఇంత‌కీ ఈ నిర్ణ‌యం వెనుక ఉద్దేశం ఏమిటి?
పాఠ‌శాల‌ల‌కు టీచ‌ర్లు స‌మ‌యానికి హాజ‌రు అయ్యేలా చూడాల‌ని, పాఠాల బోధ‌న స‌క్ర‌మంగా జ‌ర‌గాల‌ని, విద్యాప్ర‌మాణాలు మెరుగుప‌డాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. ఉద్దేశాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌క‌పోయినా, దాని కోసం తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా ఏక‌ప‌క్షంగా, మొండి వైఖ‌రితో ముందుకు సాగుతోంద‌న‌డానికి రాష్ట్రంలో ఏర్ప‌డిన గంద‌ర‌గోళ‌మే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఫ‌లితంగా టీచ‌ర్ల హాజ‌రును మెరుగుప‌ర‌చాల‌నే ఉద్దేశంతో మొద‌లైన ఈ నిర్ణ‌యం, అస‌లు స్కూళ్ల‌లో బోధ‌న‌నే దెబ్బ‌తీసే ప‌రిస్థితుల‌కు దారితీసింది.
ముందుగా ఆ నిర్ణ‌యం ఏమిటో చూద్దాం…
పాఠ‌శాల‌లకు టీచ‌ర్లు స‌మ‌యానికి హాజ‌రు అయ్యేలా చూడ‌డం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ‘సిమ్స్ ఏపీ’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. దాన్ని ప్లేస్టోర్ నుంచి టీచ‌ర్లంద‌రూ త‌మ మొబైల్ ఫోన్ల‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్‌లో వివ‌రాలన్నీ న‌మోదు చేసుకున్నాక స్కూళ్ల‌కి ఉద‌యం 9 గంట‌ల‌క‌ల్లా చేరుకోవాలి. ఆ యాప్ స‌రిగ్గా ఉద‌యం 9 గంట‌ల‌కే ఓపెన్ అవుతుంది. అప్పుడు అందులో ‘ఫేస్ రిక‌గ్నిష‌న్‌’ అనే సాంకేతికత ఆధారంగా స్కూలు నేప‌థ్యంలో త‌మ ఫొటోల‌ను తీసుకుని, ఆ ఫొటోల‌ను యాప్‌లోకి అప్‌లోడ్ చేయాలి. అప్పుడే టీచ‌ర్లు హాజ‌రయిన‌ట్టు న‌మోద‌వుతుంది. ఉద‌యం 9 త‌ర్వాత ఏమాత్రం ఆల‌స్య‌మైనా టీచ‌ర్లు ఆ రోజుకు హాఫ్‌డే సెల‌వు పెట్టుకున్న‌ట్టు న‌మోద‌వుతుంది. ఇలాగే స్కూలు ముగిసిన త‌ర్వాత కూడా చేయాల్సి ఉంటుంది.
* నిర్ణ‌యం అమ‌లు ఎలా జ‌రిగింది?
జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్ల ఎలాంటి గంద‌ర‌గోళం త‌లెత్తిందో మొద‌టి రెండు రోజులే అద్దం ప‌ట్టాయి.
రాష్ట్రంలో ల‌క్షా 90 వేల మంది ప్ర‌భుత్వ ఉపాధ్యాయులుంటే కేవ‌లం స‌గం మంది మాత్ర‌మే త‌మ హాజ‌రును ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోగ‌లిగారు. వీరిలో కేవ‌లం 30 శాతం మందికే కొత్త సాంకేతిక అంశాల‌పై అవ‌గాహ‌న ఉంద‌ని అంచనా. మొత్తానికి అనేక మంది అస‌లు ఈ యాప్ నే డౌన్‌లోడ్ చేసుకోలేక‌పోయారు. చేసుకున్న వాళ్లు స్కూళ్ల‌కు హాజ‌రై యాప్ ను ఓపెన్ చేసినా, ఒక్క‌సారిగా అనేక మంది వినియోగించిన కార‌ణంగా స‌ర్వ‌ర్ డౌన్ అయింది. చాలా చోట్ల నెట్ వ‌ర్క్ స‌మ‌స్య త‌లెత్తింది. సిగ్న‌ల్ దొర‌క‌క పోవ‌డంతో అనేక మంది టీచ‌ర్లు త‌ర‌గ‌తి గ‌దుల్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో అటూ తిర‌గాల్సి వ‌చ్చింది. క్లాసులోకి వ‌చ్చి పాఠం చెప్పాల్సిన టీచ‌ర్ క్లాస్ బ‌య‌ట ఎందుకు తిరుగుతున్నారో తెలియ‌క అనేక మంది విద్యార్థులు తెల్ల‌బోయే ప‌రిస్థితి త‌లెత్తింది. క్లాస్‌కి ఆల‌స్యంగా వ‌స్తే, గుమ్మం ద‌గ్గ‌ర నుంచుని ‘మే ఐ కమిన్ సార్‌…’ అంటూ టీచ‌ర్ ఏం తిడ‌తారో అని భ‌య‌ప‌డే విద్యార్థుల‌కు… అందుకు భిన్నంగా టీచ‌రే క్లాసులోకి చాలా ఆల‌స్యంగా వ‌చ్చిన వింత దృశ్యం క‌నిపించింది. స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, ఇత‌ర సాంకేతిక కార‌ణాల వ‌ల్ల హాజ‌రు న‌మోదు చేసుకోలేక‌పోయిన టీచ‌ర్లు, ఆందోళ‌న‌తో హెడ్మాస్ట‌ర్ ను క‌లిసి మొర‌పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న వారికి న‌చ్చ‌చెప్పి ఉన్న‌తాధికారుల‌కు చెబుతాన‌ని బుజ్జ‌గించాల్సి వ‌చ్చింది. కొన్ని చోట్ల టీచ‌ర్లు అంద‌రూ ఈ యాప్ విధానాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్టు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఎన్నో చోట్ల టీచ‌ర్లు త‌మ నిరస‌న‌ను ప్రక‌టిస్తూ ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్లి సంబంధిత విద్యాధికారుల‌కు విన‌తి పత్రాలు స‌మ‌ర్పించారు. తమ హాజ‌రు స‌రిగా న‌మోదైందో లేదో అనే ఆందోళ‌న‌తో, హాఫ్ డే సెల‌వు క‌ట్ అయిపోతుందేమోన‌నే ఆవేద‌న‌తో, ఇలా నెల‌కి ఎన్ని సెల‌వులు పోతాయోన‌నే అనుమానాల‌తో…చాలా చోట్ల ఉపాధ్యాయులు స‌క్ర‌మంగా పాఠాలు చెప్ప‌లేక‌పోయారు.
*ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేదీ?
* సెల్‌ఫోన్ల వినియోగం అధిక‌మ‌వ‌డంతో న‌గ‌రాల్లోనే చాలా చోట్ల సిగ్న‌ల్ స‌మ‌స్య త‌లెత్తున్న నేప‌థ్యంలో మండ‌లాల్లో, గ్రామాల్లో… ఇంకా మారుమూల గిరిజ‌న ప్రాంతాల్లో టీచ‌ర్ల సెల్‌ఫోన్ల‌కు సిగ్న‌ల్ దొర‌క‌క‌పోతే ప‌రిస్థితి ఏమిటి?
* ఉద‌యం 9 గంట‌ల‌కు ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా హాజ‌రు న‌మోదు కాద‌ని, హాఫ్ డే సెల‌వు పెట్టుకోవాలనే నిబంధ‌న విధించ‌డం స‌మంజ‌స‌మేనా?
* ప్ర‌భుత్వ టీచ‌ర్లంద‌రికీ స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయా? ఉన్న‌వారంద‌రిలోనూ యాప్‌ను వినియోగించుకునే సాంకేతిక అవ‌గాహ‌న ఉందా?
* నెట్‌వ‌ర్క్ ప‌నిచేయ‌క‌పోతే టీచ‌ర్లు ఏం చేయాలి?
* కొత్త యాప్ ను రూపొందించాక దాన్ని ఎలా ఉప‌యోగించాలో అవ‌గాహ‌న క‌ల్పించారా?
* ఫేస్ రిక‌గ్నిష‌న్ లాంటి సాంకేతిక అంశం ఇమిడి ఉన్న యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకునేప్పుడు… ఫోన్‌లోని ఫొటోలు, కాంటాక్టులు, మెసేజిలు, లొకేష‌న్ లాంటి అంశాల‌కు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి అలాంట‌ప్పుడు వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక‌యితే అందుకు బాధ్యులు ఎవరు? ఆ స‌మాచారం ఆధారంగా వ్య‌క్తిగ‌త పాస్‌వ‌ర్డ్ లు, బ్యాంకు వివరాలు హ్యాక‌ర్ల చేతికి చిక్కి సైబ‌ర్ నేరాల‌కు దారి తీస్తే దానికి ఎవ‌రిది పూచీ?
* ఇటీవ‌ల ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను ద‌గ్గ‌ర్లోని ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో విలీనం చేసి, టీచ‌ర్ల‌ను వేరే చోట్ల‌కు మార్చారు. కానీ కొత్త యాప్ లో చూస్తే ఆయా టీచ‌ర్లు పాత పాఠ‌శాల‌ల్లో ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. మ‌రి వీరి హాజ‌రు న‌మోదు చేయ‌డం ఎలా?
* స్మార్ట్ ఫోన్ వినియోగ‌మ‌నేది వ్య‌క్తిగ‌త అంశం. ఫోన్ వినియోగాన్ని త‌గ్గించుకోవాల‌ని, డేటా ఛార్జీలు పెరిగిన నేప‌థ్యంలో డేటా వినియోగాన్ని ప‌రిమితం చేసుకోవాల‌ని అనుకునే టీచర్ల సంగ‌తేంటి? డేటా వినియోగానికి అయ్యే ఖ‌ర్చును టీచ‌ర్లు సొంతంగా ఎందుకు భ‌రించాలి?
* సాంకేతిక కార‌ణాల వ‌ల్ల హాజ‌రు న‌మోదు చేసుకోలేక‌పోయిన టీచ‌ర్లు, ఎలాగూ సెల‌వు ప‌డిపోతుంద‌నే ఉద్దేశంతో బ‌య‌ట‌కి వెళ్లిపోతే విద్యాబోధ‌న సంగ‌తేంటి?
* ఏకోపాధ్యాయ పాఠ‌శాల‌ల్లో ఉన్న ఒక్క టీచ‌రు హాజ‌రు న‌మోదు చేసుకోలేక సెల‌వు పెట్టి వెళ్లిపోతే అక్క‌డ విద్యార్థుల సంగ‌తేంటి?
– ఇవే కాదు, ఇలాటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానాలు లేవు.
*ఎల్లెడ‌లా వ్య‌తిరేక‌త‌…
యాప్ ఆధారంగా హాజ‌రు న‌మోదుపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులంద‌రూ ఏదో విధంగా త‌మ నిర‌స‌న‌ను ప్ర‌క‌టిస్తున్నారు. బ‌హిరంగంగానే వ్య‌తిరేకిస్తున్నారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు కూడా దీనిపై ఉద్య‌మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఏపీ ఉపాధ్యాయ సంఘాల స‌మాఖ్య (ఫ్యాప్టో), డెమొక్ర‌టిక్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ త‌దిత‌ర టీచర్ల సంఘాలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌ద్దంటూ పిలుపునిచ్చాయి. టీచర్ల‌లో త‌లెత్తే అనేక భ‌య సందేహాల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మాధానం ల‌భించేవ‌ర‌కు ఆన్‌లైన్‌లో హాజ‌రు న‌మోదుచేసుకోద్ద‌ని పిలుపునిచ్చాయి. అనేక చోట్ల ఉపాధ్యాయులు విద్యాధికారుల‌ను క‌లిసి త‌మ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తూ లేఖ‌లు ఇచ్చారు. ప్ర‌భుత్వం అంద‌రికీ డివైజ్‌లు ఏర్పాటు చేసి, డేటా స‌దుపాయాల‌ను క‌ల్పిస్తే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని టీచ‌ర్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్ప‌టికే పాఠ‌శాల‌ల్లో హెడ్మాస్ట‌ర్లు, టీచ‌ర్లు అనేక బోధ‌నేత‌ర కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం విద్యార్థుల హాజ‌రు, మ‌ధ్యాహ్న భోజ‌న విద్యార్థుల హాజ‌రు, మ‌రుగుదొడ్ల శుభ్ర‌త‌, విద్యాకానుక‌, నాడు నేడు ప‌నుల వివ‌రాల‌ను దాదాపు 12 యాప్ ల ద్వారా న‌మోదు చేయాల్సి వ‌స్తోంద‌ని, వీట‌న్నింటి వ‌ల్ల విద్యాబోధ‌న కుంటుప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే అనేక పాఠ‌శాల‌ల్లో బ‌యో మెట్రిక్ విధానం ద్వారా హాజ‌రు న‌మోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఐరిస్ విధానం కూడా ఉంది. ఈ సాంకేతిక హాజ‌రు విధానాలు అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో వాటినే మ‌రింత ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌కుండా, కొత్త‌గా ఫేస్ రిక‌గ్నిష‌న్ అనే మ‌రో విధానం ఎందుక‌ని టీచ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు.
*ఏదో ఒక వివాదం త‌ప్ప‌దా?
జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల నిత్యం ఏదో ఒక వివాదం ఆంధ్రాలో న‌డుస్తూనే ఉంటోంది. ఒక్క విద్యా రంగాన్ని తీసుకున్నా ఈ విష‌యం సుస్ఫ‌ష్టమే. మొన్నటికి మొన్న‌ ఏకోపాధ్యాయ పాఠ‌శాల‌ల‌కు సంబంధించి త‌ల్లిదండ్రులు, విద్యార్థులు రోడ్ల‌కెక్కి ఆందోళ‌న‌లు చేశారు. నిన్న‌టికి నిన్న ప్రాథ‌మిక పాఠ‌శాలల విలీనాన్ని వ్య‌తిరేకిస్తూ త‌ల్లిదండ్రులు నిర‌స‌న ప్‌్ద‌ర్శ‌న‌లు జ‌రిపారు. ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల్ల విద్యా వ్య‌వ‌స్థ గాడి త‌ప్పుతోంద‌నే ఆవేద‌న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్త‌ల్లో స‌ర్వే స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. అయితే ఇవేమీ ప‌ట్ట‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం మొండిగా, ఏక‌ప‌క్షంగా, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూనే ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *