Amaravati Padayatra: 700వ రోజుకు అమరావతి ఉద్యమం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఈరోజుకి 16వ రోజుకి చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్రలో ఈరోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతి రైతుల ఉద్యమం మంగళవారానికి 700వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు రాజధాని ఐక్య కార్యాచరణ కమిటీ పేర్కొంది. సర్వమత ప్రార్థనలు, అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించడం, అలాగే అమరావతి లక్ష్య సాధన కోసం ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం 10 గంటలకు మహిళల ప్రత్యేక మాలధారణ, ఎస్సీ మైనారిటీల అమరావతి సంకల్పం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అమరావతి ఉద్యమ గీతాలపన, మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘట్టాలపై వ్యాఖ్యానం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన, సాయంత్రం 6 నుంచి 7 వరకు అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాపాయాత్ర 45 రోజులపాటు కొనసాగనుంది. ఈ యాత్ర డిసెంబర్‌ 15న తిరుపతిలో ముగియనుంది.