వాలంటీర్లు గాడిదలు కాస్తున్నారా: రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట, తడ, జనంకోసం మా నాయకుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ అన్నారు. సుమారు 10 సంవత్సరాలుగా సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎటువంటి పదవిలేని నా మాటలకు స్పందించాడు అంటే నా స్థాయి ఏంటో ప్రజలు తెలుసుకోవాలని సోమశేఖర్ అన్నారు. జనసేన పార్టీ నాయకులు అన్ని పార్టీల లాంటివారు కాదని ప్రజల పక్షాన నిలబడే వారని, ఏ పార్టీ మీద సొంత కక్షలు పగలు జనసేన వారికి ఉండవని అలాగే ప్రజలకు అన్యాయం చేసే ఏ పార్టీ నాయకులనైనా జనసేన ప్రశ్నిస్తుందని ఆయన అన్నారు. దొరవారిసత్రం మండలం కారికాడులో ఎప్పటినుంచో నీటి సమస్య ఉందని కారికాడు గ్రామ ప్రజలు మురికి నీరు తాగుతున్నారని, వెలకాడు గ్రామంలో విద్యుత్ స్తంభాల సమస్య, శ్రీధనమల్లి, కుమ్మరి కండ్రిగ మనేరి, కెపి కండ్రిగ గ్రామాల్లో ఇళ్ళు, నీళ్లు, రోడ్లు, స్కూళ్లు సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైసిపి ఎమ్మెల్యేని అధికారులను కోరారు. శ్రీసిటీ, శ్రీహరికోట, మాంబట్టు సెజ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పరిశ్రమలు, అంతరిక్ష కేంద్రం ఉన్నటువంటి సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం మండలాల్లో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో త్రాగునీరు, కనీసం ఉండటానికి ఇళ్ళు లేని పేద కుటుంబాలు ఇంకా ఉన్నారని వాపోయారు. ఎంతో అభివృద్ధి చేశామని బడాయి మాటలు చెప్పుకునే వైసిపి నాయకులకు ఇవన్నీ కనబడటం లేదా అని సోమశేఖర్ ధ్వజమెత్తారు. సూళ్లూరుపేట మండలం షార్ సమీపంలో ఉన్న కొరిడి, కొల్లపట్టు, దామరాయి, పేర్నాడు, ఆటకానితిప్ప వెళ్లే రోడ్డు మార్గం దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకుండా ఉన్న తరుణంలో జనసేన నేత సోమశేఖర్ మరియు జనసైనికులు అనేకమార్లు అక్కడ గ్రామాల ప్రజలను కలిసి స్థానిక ఎమ్మెల్యేకి మీడియా ద్వారా తెలియజేసినా పట్టించుకోని ఆయన వైఖరికి అసమర్థతకు అద్దం పడుతుందని, ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని సోమశేఖర్ తెలిపారు. తడ మండలం మాంబట్టు గిరిజన కాలనీలో ఒక ఇందిరమ్మ టైంలో కట్టిన ఇంట్లో పాము పుట్ట ఆ పక్క గదిలో గిరిజన కుటుంబం నివసిస్తుంటే పట్టించుకోని వైసీపీ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చంకలు గుద్దుకునే వైసిపి ప్రభుత్వానికి వాలంటీర్లకు ఈ ఘోరాలు కనబడటం లేదా అని సోమశేఖర్ అన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నో ఏళ్ల వెనుకకు వెళ్ళిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల సమస్యలను తీర్చాలని సోమశేఖర్ అన్నారు.