కిరణ్ రాయల్ అరెస్టు అప్రజాస్వామికం

* ఆయన కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది
రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ కిరణ్ రాయల్ ను అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఖండించారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఏ కేసు పెట్టారో చెప్పకుండా, కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా అందర్నీ భయబ్రాంతులకు గురి చేసేలా ఇంటి తలుపులకు తాళాలు వేసి మరీ కిరణ్ రాయల్ ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడం దురదృష్టకరం. నగరి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగంగా చర్చించడానికి ముందుకు రావాలని మంత్రి రోజా గారికి శ్రీ కిరణ్ రాయల్ సవాల్ చేయడంతో… అప్పటి నుంచి కక్షగట్టిన మంత్రి జనసేన నాయకులు, వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం.
*శ్రీమతి రోజా  ఏ విధంగా మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసు
జనసేన పార్టీ తరఫున పోలీస్ శాఖను ఒకటే కోరుతున్నాం. వైసీపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో.. వాళ్లు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సరైంది కాదు. ముందుగా నోటీసులు ఇవ్వండి న్యాయపరంగా మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తాం. అవసరమైతే మా నాయకులే పోలీసులకు తగిన విధంగా సహకరిస్తారు. అంతేతప్ప మంత్రి చెప్పారని ఇష్టానుసారం అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మంత్రి రోజా బహిరంగంగా ఎలా మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ అరెస్టు అంశం మీద చర్చించారు. జన సైనికులంతా కిరణ్ రాయల్ కుటుంబానికి అండగా నిలబడతాం. ఆయన సమస్యలపై బలంగా మాట్లాడుతారు.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. రాజకీయ కక్ష సాధింపులో ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో వైసీపీ నాయకుల దాష్టీకాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. ప్రజా ప్రస్థానంలో జనసేన పార్టీని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.