భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్
ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించి యావత్ భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్ ను అసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకొంది. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించి విప్లవ బాటలో ముందుకెళ్లి ప్రాణ త్యాగం చేసిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. యౌవన ప్రాయంలో ఉరికొయ్యను ముద్దాడినా… ఆ యోధుడు భరత జాతికి అందించిన చైతన్యం అమూల్యమైనది. భగత్ సింగ్ జీవితం నుంచి ప్రతి ఒక్కరం స్ఫూర్తి పొందాలి. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు భగత్ సింగ్ లాంటి ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలం అని యువత ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి అని జనసేనాని స్పష్టం చేశారు.