ముద్దులు పెట్టి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి

* మరోసారి జగన్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేయొద్దు
* సరికొత్త మార్పు ప్రస్థానం మొదలుపెడదాం
* జనసేన జెండా నిజాయతీకి నిలువుటద్దం
* జన సైనికుల రక్షణ కోసం ప్రత్యేక లీగల్ సెల్
* జగన్ రెడ్డి ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి రూ.ఏడు లక్షల పరిహారం ఇవ్వాలి
* ఉమ్మడి కర్నూలు జిల్లా జన సైనికుల సమావేశంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

‘రైతు బిడ్డను అన్నాడు.. అడిగిన వారికి, అడగని వారికి ముద్దులు పెట్టి మరీ భరోసా ఇచ్చాడు.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కదాని శ్రీ జగన్ రెడ్డిని ప్రజలూ నమ్మారు. పేదలకు ఏదో ఒకటి చేస్తాడు అని భావించారు. ఓటేశారు.. చివరికి మోసపోయామని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తించి లబోదిబోమంటు’న్నారు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. శుక్రవారం సాయంత్రం నంద్యాలలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసైనికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జన సైనికులు ఎదుర్కొంటున్న కష్టాలు మా దృష్టికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లు ఉండటంతో చాలా మంది పోలీసు కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వీరికి అండగా జనసేన పార్టీ ముగ్గురు లాయర్ లతో కూడిన లీగల్ సెల్ ను ఏర్పాటు చేసింది. దానిని ప్రతి ఒక్క జన సైనికుడు వినియోగించుకోవాలి. తప్పుడు కేసులకు ఏమాత్రం భయపడవద్దు. కచ్చితంగా మీకు పార్టీ అండగా నిలబడుతుంది. మీరు కూడా అంతే కసితో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా పని చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర ను గ్రామీణ ప్రాంతాల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత జనసైనికులదే. దీనిని ప్రతి ఒక్క జన సైనికుడు గుర్తుంచుకోవాలి. త్వరలోనే కర్నూలు జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కమిటీ తో పాటు మండల, గ్రామ కమిటీలు వస్తాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న కొన్ని కుటుంబ కక్షలు, గ్రూపు రాజకీయాలు, వేధింపులు, నియంత పాలనలు, బెదిరింపులను బలంగా ఎదుర్కొని జనసైనికులు నిలబడాలి. ఒకసారి వైస్సార్సీపీ కి ఓటు వేసి ఎంత తప్పు చేశామో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది. మరోసారి ఇదే తప్పు చేయవద్దు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న డ్రిప్ సబ్సిడీలు, యంత్ర రాయితీలు, ఇతర రైతుల సాయాలు అన్నీ ఆగిపోయాయి. అన్నీ తీసేసి రైతు భరోసా డబ్బులు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. ఆ రైతు భరోసా సాయం లోనూ కులాలను చూసి సాయం అందించడం సిగ్గుచేటు. కచ్చితంగా ప్రజల కోసం నిలబడే మనిషి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తన సొంత డబ్బును ఏ మాత్రం ఆలోచించకుండా రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఖర్చుపెడుతున్న గొప్ప మనసు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. దానిని ప్రతి జన సైనికుడు ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి. వారికి అర్థమయ్యేలా చెప్పండి. కేవలం సోషల్ మీడియాలో హడావుడి చేసి క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటే కుదరదు. ప్రతి గడపగడపకు వెళ్లి జనసేన చేస్తున్న గొప్ప కార్యక్రమాలను వివరించండి.
* ఛాలెంజ్ చేస్తున్నా… మీరు ప్రజల్లోకి స్వేచ్ఛగా రాగలరా?
రైతు భరోసా యాత్రలో సొంత డబ్బును ఖర్చు చేస్తూ, రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి పద్ధతిలోనే ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి ప్రజల్లోకి నిర్భయంగా రావాలి. ప్రత్యేక చట్టం చేసి ఏడు లక్షల రూపాయలు వారం రోజుల్లోనే ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి. వన్టైమ్ సెటిల్మెంట్ చేసి కౌలు రైతుల అప్పులను పూర్తిగా తీర్చాలి. ఈ ముఖ్యమంత్రికి స్వేచ్ఛగా ప్రజల్లోకి వచ్చేందుకు కూడా భయమే. 7.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అసహ్యించుకునే పరిస్థితికి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి తీసుకు వచ్చారు. ఎంత సేపు సంక్షేమం పాట పాడుతున్నారు తప్పితే అభివృద్ధి లేదు. గ్రామాల్లో ఎన్ని గంటలు కరెంటు తీస్తున్నారు అనే దగ్గర నుంచి ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారు అనే స్థాయికి తీసుకొచ్చారు. యువతకు జాబ్ క్యాలెండర్ లేదు. కనీస ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వారు మళ్ళీ దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిపైనా జనసైనికులు పోరాడాలి. కచ్చితంగా పార్టీ నుంచి అవసరమైన సహాయం మేం అందిస్తాం.
* కేవలం 9 శాతం మందికే కౌలు రైతుల గుర్తింపు కార్డులు
రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ఒక అంచనా. అయితే వారిలో కేవలం 9 శాతం మందికే కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఉన్నాయి. మిగిలిన వారు అసలు కౌలు తీసుకున్నట్లు ఎలాంటి లెక్కా పత్రం లేదు. ఈ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి తీసుకువచ్చిన చట్టంలో లొసుగులు ఉన్నాయి. భూమి సొంతదారు 11 నెలల అగ్రిమెంట్ ఇస్తేనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో గుర్తింపు కార్డులు ఎవరికి అందడం లేదు. కౌలు రైతులకు నష్టం వచ్చినా, వారు ఆత్మహత్య చేసుకున్నా కనీసం ప్రభుత్వానికి పట్టడం లేదు. వారి కుటుంబ ఘోష ప్రభుత్వానికి వినబడటం లేదు.
* సీఎంలా సిమెంట్ ఫ్యాక్టరీలు… లక్షల కోట్లు శ్రీ పవన్ కళ్యాణ్ కి లేవు
ప్రజల గురించి ఆలోచించే మనసు తప్ప సిమెంటు ఫ్యాక్టరీలు, లక్షల కోట్ల రూపాయలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఆయన చేసే సినిమాలకు కూడా మీరు రకరకాల అవాంతరాలు సృష్టిస్తారు. అయినా ఆయన దృష్టి అంతా ప్రజల కష్టాలు, కన్నీళ్లు పైనే ఉంటుంది. సొంత కష్టార్జితాన్ని రైతులకు పంచే గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులను ఆదుకునేందుకు వస్తున్నారని తెలిస్తేనే మీకు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు గుర్తుకు వస్తున్నాయా? అప్పటికప్పుడు ఆదరాబాదరాగా ఎంతో కొంత సాయం అందించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా? మీ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా.. గ్రామాల్లో ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఎవరో తెలుసుకోలేక పోతున్నారా? లేక తెలిసే వారికి సాయం అందించేది ఏమిటి అని అనుకుంటున్నారా అనేది అర్థం కావడం లేదు. కచ్చితంగా మీరు తీసుకువచ్చిన చట్టం ప్రకారం ప్రతి కౌలు రైతుకు ఏడు లక్షల రూపాయల సహాయం అందాల్సిందే. అప్పటివరకు జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. వీలైనంత మంది రైతులకు సహాయం అందిస్తుంది. గత మూడేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వం దాచి పెట్టింది. ఎంతో కష్టపడి వివరాలు సంపాడించాం. మొత్తం మూడు వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో కేవలం రాజకీయ పరిచయాలు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందింది. అది కూడా ఏడు లక్షల సహాయం అందే నాటికి రైతు చేసిన అప్పు వడ్డీ పెరిగి… పూర్తిగా ఆ డబ్బు అప్పు కట్టుకోవడానికి సరిపోతోంది. ఇది క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దౌర్భాగ్యం.
* ప్రజల కోసం నిలబడే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 5,600 ఓట్లు సాధించాం. అలాగే నంద్యాల డివిజన్ లోని 3 కీలక నియోజకవర్గాల్లో కలిపి సుమారు 11 వేల కీలక పార్టీ సభ్యత్వాలను చేర్చగాలిగాం. పార్టీకి ఇక్కడ బలం ఉంది. జనసైనికులు నిలబడాలి. నాయకుడు తీసుకునే నిర్ణయాలకు కంకణబద్ధులై పని చేయండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో సందేహం లేదు. గడపగడపకు వెళ్లి పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరించాల్సిన బాధ్యత జనసైనికులదే. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల గాథలు వింటే కన్నీళ్లు వస్తున్నాయి. వారికి కనీస సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దానిని పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ” పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, జనసేన పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.పాకనాటి గౌతమ్ రాజ్, ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు శ్రీ చింతా సురేష్ బాబు, శ్రీ బాల వెంకట్, శ్రీమతి రేఖ గౌడ్, శ్రీమతి హసీనా బేగం, శ్రీ అర్షద్, శ్రీ వై.విశ్వనాథ్, శ్రీ మైలేరి మల్లయ్య పాల్గొన్నారు.