మణిపూర్‌లో విరుచుకుపడిన ఉగ్రవాదులు.. కల్నల్‌ కుటుంబంతో సహా నలుగురు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మయన్మార్‌ సరిహద్దుకు సమీపంగా మణిపూర్‌లోని చూరాచంద్‌పూర్‌ జిల్లాలో అస్సోం రైఫిల్స్‌ కాన్వారుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆర్మీ కల్నల్‌, ఆయన భార్య, కుమారుడుతో పాటు మరో నలుగురు జవాన్లు మృతి చెందారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చురాచంద్‌పూర్‌ జిల్లాలో 46 రైఫిల్స్‌ కాన్వారుపై శనివారం ఉగ్రవాదుల దాడి జరిగినట్లు అధికారిక వర్గాలు దృవీకరించాయి. అధికారిక నివేదికల ప్రకారం, 46 అస్సాం రైఫిల్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠి సెలవు ముగించుకొని కుటుంబసభ్యులతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు. బెహియాంగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని బెహియాంగ్‌ సమీపంలో శనివారం ఉదయం 10 గంటలకు ఆకస్మిక దాడి జరిగినట్లు మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఆకస్మిక దాడిలో కల్నల్‌ త్రిపాఠి, అతని భార్య, వారి కుమారుడు, మరో నలుగురు జవాన్లు మరణించారని భద్రతా వర్గాలు తెలిపాయి. మరికొందరు జవాన్లు గాయపడగా వారిని బెహియాంగ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ఎఆర్‌ బృందాలు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కూంబింగ్‌ చేస్తున్నాయి. ఒసి బెహియాంగ్‌ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తరలిస్తున్నారని పోలీసులు వర్గాలు తెలిపాయి.