నిజాయతీకి నిలువెత్తు రూపం దామోదరం సంజీవయ్య: పవన్ కళ్యాణ్

భారత జాతి గర్వించదగిన రాజనీతజ్ఞుడు దామోదరం సంజీవయ్య. అతి సాధారణ.. అందులోనూ అణగారిన వర్గాలవారి కుటుంబంలో జన్మించి, అసాధారణ ప్రజానాయకునిగా ఆవిర్భవించిన సంజీవయ్య జీవితం, జీవనయానం సర్వదా ఆదర్శప్రాయం. నేడు ఆ మహానుభావుని జయంతి సందర్భంగా నా తరపున, జనసేన శ్రేణుల తరపున ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆ మహనీయుని సేవలను అందరం స్మరించుకోవాలి అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు పదుల వయసు రాకుండానే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా.. అంతకు మునుపే రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, కాంగ్రెసుకు రెండుసార్లు జాతీయ అధ్యక్షునిగా ఆయన నిర్వర్తించిన బాధ్యతలు, ప్రజలకు చేసిన సేవలు అద్భుతం, ఆదర్శప్రాయం. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ఎవరూ చేరుకోనంత సమున్నతంగా ఉన్నాయంటే ఆయనలోని దార్శనికతకు జేజేలు పలకవలసిందే. అణగారిన వర్గాల వారికి ఆరు లక్షల ఎకరాల భూముల్ని అందించిన భూదాతగా కీర్తి గడించారు. వృద్ధాప్యపు పెన్షన్లు, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన సంక్షేమశీలి. మద్యనిషేధ విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటుచేసిన సంస్కర్త. కాపులకు రిజర్వేషన్లను అందించిన కాపు భాంధవుడు. స్వతహాగా జానపద గేయాలన్నా, నాటకాలన్నా అమిత ప్రేమగల సంజీవయ్య తన పాలనలో అధికార భాషగా తెలుగుకు పట్టం కట్టారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పదవి భాద్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో 1965 మే 29వ తేదీన పార్లమెంట్‌లో బోనస్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి ‘బోనస్‌ సంజీవయ్య’గా మన్ననలు అందుకున్నారు. జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్‌ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలోకి చేర్పించి కార్మిక పక్షపాతిగా ఖ్యాతి పొందారు. ఇలా చెప్పుకొంటే ఆయన ఈ దేశానికీ, తెలుగు ప్రజలకు చేసిన సేవలు ఎన్నో.. మరెన్నో. మంత్రిగా పని చేసినా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చినా ఆయన ఎకరం పొలం గాని, ఆయనకంటూ ఒక ఇల్లుగాని సంపాదించుకోలేదు. నిలువెత్తు నిజాయతీకి ప్రతిరూపం సంజీవయ్య. పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగి పేదగానే తనువు చాలించిన ఆదర్శమూర్తి సంజీవయ్య. ఇటువంటి మహానుభావుని పేరును ఆయన జన్మించిన జిల్లాకు పెట్టడానికి మనస్సు ఒప్పుకోవడంలేదు నేటి పాలకులకు. ఆయన పుట్టిన ఇంటిని స్మారక చిహ్నంగా రూపుదిద్దాలన్న ప్రజల కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది. ఈ కోరికను సాకారం చేయడానికి సంకల్పించాను. అందుకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా ఆయన జ్ఞాపకాలను తెలుగు జాతికి చిరంతనంగా జనసేన పక్షాన అందిస్తానని సంజీవయ్య జయంతి సందర్భంగా వినమ్రంగా తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.