నీట మునిగిన ఢిల్లీ విమానాశ్రయం

దేశ రాజధానిని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య దిల్లీలో 121.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో రహదారులు, అండర్‌పాస్‌ల వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నరేలా ప్రాంతంలో ఓ పాత భవనం కుప్పకూలిందని, అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదని తెలిపారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలోకి సైతం వాన నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా అధికారులు మూడు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరో 5 సర్వీసులను జైపుర్‌, అహ్మదాబాద్‌లకు మళ్లించారు. వాన నీటిని తోడేశామని, ఉదయం 9 గంటలకల్లా పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు తెలిపాయి.

46 ఏళ్లలో ఎన్నడు లేనంతగా..

ప్రస్తుత వర్షాకాలంలో దిల్లీలో గత 46 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 113.66 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాదితో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు. 1975 వర్షాకాలంలో దిల్లీలో 115 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ఈ ఏడాదే ఆ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోయిన అండర్‌పాస్‌లో బస్సు చిక్కుకుపోవడంతో అందులో ఉండిపోయిన 40 మంది ప్రయాణికులను దిల్లీ అగ్నిమాపక సేవల విభాగం సిబ్బంది కాపాడారు. దిల్లీ నుంచి మథుర వెళుతున్న ఈ బస్సు పాలం పైవంతెన ప్రాంతంలో చిక్కుకుపోయిందని, ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని అధికారులు చెప్పారు. వేరే ప్రాంతంలో టెంపో ట్రావెలర్‌లో చిక్కుకున్న 18 మంది ప్రయాణికులను సైతం కాపాడామన్నారు.