ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ

• అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ రూ.67,29,398
• రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ దంపతులు రూ.25 లక్షలు
వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి ద్వారా చెక్కులు అందించారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 చెక్కును శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి.యువ షణ్ముఖ, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ ఫరూక్ జాన్, ప్రధాన కార్యదర్శి శ్రీ బి.శంకరరావు దొర తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం అధ్యక్షులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రాణమ్ మార్కండేయ బాబు పాల్గొన్నారు.
రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళం సహాయ నిధికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందచేశారు.
• గ్రామ పంచాయతీలకు నటుడు శ్రీ ఆది రూ.3 లక్షల విరాళం
యువ నటుడు శ్రీ ఆది గ్రామ పంచాయతీలకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు. వరద పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా)కి ఇచ్చారు. శ్రీ ఆది మాట్లాడుతూ “వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి నా వంతుగా రూ.3 లక్షలు అందించాను” అన్నారు.