రైతు భరోసా కేంద్రాలు మాకేమీ ఉపయోగపడటం లేదు

* వైసీపీ రంగులేసుకొన్నారంతే
* గిట్టుబాటు ధర దక్కడం లేదు
* జనసేన పి.ఎ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గర శిరివెళ్ళ రైతుల ఆవేదన

రైతు భరోసా కేంద్రాలు వైసీపీ రంగులద్దుకోవడానికి తప్ప రైతులకు ఏ విధమైన ప్రయోజనం కలిగించడం లేదని కర్నూలు జిల్లా, శిరివెళ్ళ ప్రాంతానికి చెందిన రైతులు వాపోయారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు భరోసానే లేదని తెలిపారు. సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం లేదు.. పంట పండిన తర్వాత ఒక్క గింజా కొనుగోలు చేసిందీ లేదని రైతులు శ్రీ ఉల్లి తిరుపేలు, శ్రీ కిట్టన్న, శ్రీ అడవి నాగయ్య, శ్రీ కామిని జయన్నలు చెప్పారు. ఈ నెల 8వ తేదీ జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించనున్న రచ్చబండ ప్రాంగణం వద్ద పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని స్థానిక రైతులు కలిశారు. ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… “ఈ ప్రాంతాలలో ఉన్నవారంతా చిన్న సన్నకారు రైతులమే. కష్టపడి వ్యవసాయం చేస్తాం. నష్టం వచ్చినా వ్యవసాయం మానుకోలేము. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. గడచిన మూడు సంవత్సరాలుగా దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అకాల వర్షాలు, విపత్తుల కారణంగా నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందడం లేదు. పరిహారం ఇచ్చినా అది కౌలు రైతులకు చేరడం లేదు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఎఫ్ఐఆర్ లో రైతు ఆత్మహత్య అని రాయనివ్వడం లేదు” అని తెలిపారు. గిట్టుబాటూ లేదు.. గింజ కొనే నాధుడూ లేడనీ పండించిన పంట మొత్తం అయినకాడికి దళారులకు అమ్ముకోక తప్పడం లేదని చెప్పారు. రైతు చనిపోతే ఇన్నాళ్లు పట్టించుకోని పాలకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనగానే స్వయంగా శాసనసభ్యులే ఇళ్లకు వచ్చి పరిహారం ఇచ్చి వెళ్తున్నారని అన్నారు. ‘చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేవు. అసలు యువత ఈ రాష్ట్రంలో మనుగడ సాధించే పరిస్థితులు లేవు. ప్రోత్సాహకాలు ఇస్తే యువత కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి చూపుతుంద’ని శ్రీ జయన్న అనే యువకుడు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ అస్ధవ్యస్థం అయిపోయాయి. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యువతకు ఉపాధి లేదు. ఉపాధి కల్పించాలన్న మనసు ముఖ్యమంత్రికి లేదు. ఉపాధి అవకాశాలు రావాలి అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు రావాలి. ఆ పరిస్థితులు లేవు. నోటిఫికేషన్లు లేవు. వ్యవసాయదారులకు ఉన్న సబ్సిడీలు మొత్తం ఎత్తేశారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల కష్టాలు తీరుతాయ”ని అన్నారు.