మత్స్యకార భరోసా….మందగిస్తోంది!

*11000 తగ్గిన లబ్దిదారుల సంఖ్య
*సంక్షేమ పథకాల సొమ్ముల కత్తెరలో భాగమేనా….

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019 చివర్లో ప్రవేశపెట్టిన వైఎస్‌ మత్స్యకారుల భరోసా పథకం నాలుగో సంవత్సరంలో ప్రవేశించింది. మంచిదేగాని, ఈ భరోసా అందుకునే మత్స్యకారుల కుటుంబాల సంఖ్య తగ్గడం చేపలు పట్టే వృత్తిపై ఆధారపడిన సాగరతీరంలో అనుమానాలకు, అసంతృప్తికి దారితీస్తోంది. ఏ సంక్షేమ పథకం అయినా కాలం గడిచేకొద్దీ ఎక్కువ మంది లక్షిత లబ్ధిదారులకు మేలు చేసే విధంగా ఉండాలి. ఈ క్రమంలో కొన్నేళ్ల తర్వాత అయినా అందరికీ ప్రభుత్వ ‘భరోసా’ ఫలాలు చేరాలి. కాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారు రెండున్నరేళ్ల క్రితం అమలులోకి తెచ్చిన మత్స్యకార భరోసా కార్యక్రమం (ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం) ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వేయి కిలోమీటర్ల తీరం వెంబడి ఉన్న బెస్త గ్రామాల ప్రజలకు మేలు చేస్తుందని ఆశించారు. ఎందుకంటే, 2016లో రూపొందించిన పరిశోధనా పత్రం అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ తీరంలో బంగాళాఖాతం వెంబడి 555 మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి ఉన్న కుటుంబాల సంఖ్య 1,63,427 వరకూ ఉంది. 6,05,428 మంది జనం మత్స్యకారులుగా జీవిస్తున్నారని అప్పటి అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరగి ఉంటుంది అనడంలో సందేహం లేదు.
*వేట నిషేధ సమయంలో ఆదుకునేందుకే….
వేసవి కాలంలో ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుంది. చేపలు గుడ్లు పెట్టే సమయంలో అవి దెబ్బతినకుండా ఉండటానికి ఏటా ఇలా చేస్తుంటారు. మరి ఈ సమయంలో ప్రధాన ఆదాయం కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10,000 అందజేసే కార్యక్రమమే ఈ వైఎస్‌ మత్స్యకార భరోసా. మే నెల 13న ముఖ్యమంత్రి జగన్‌ కోనసీమలోని మురమళ్ల గ్రామంలో ఈ పథకం తాజా కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు దినపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం– రాష్ట్రంలోని మొత్తం 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.10,000 చొప్పున నాలుగో విడత ‘భరోసా’ సాయంగా రూ.109 కోట్లు సీఎం జగన్‌ వారి వారి బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
* ఆ కుటుంబాలు ఏమయ్యాయి?
2021లో ఈ సంక్షేమ కార్యక్రమం కింద రాష్ట్రంలోని సముద్రతీర గ్రామాల్లోని 1,19,875 కుటుంబాలకు వైఎస్‌ మత్స్యకార భరోసా కార్యక్రమం కింద ఆర్థిక సాయం అందజేశారు. మరి, ఈఏడాది ఈ పథకం కింద లబ్ధిపొందే కుటుంబాల సంఖ్యను 11,120 వరకూ తగ్గించారు. కిందటేడాది రాష్ట్ర సర్కారు సాయం పొందడానికి అర్హులైన మత్స్యకారులు ఇప్పుడు అనర్హులు అయ్యారా? లేక వారు బంగాళాఖాతంలో చేపలు పట్టడం అనే వృత్తి నుంచి తప్పుకున్నారా? లేక వారంతా వేరే లాభసాటి వృత్తిలోకి వెళ్లిపోయారా? ఈ ప్రశ్నలకు జగన్‌ ప్రభుత్వం జవాబులు ఇవ్వలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, కిందటేడాది మే నెల 18న 1,19,875 బెస్త కుటుంబాల అకౌంట్లలోకి భరోసా సొమ్మును జమచేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ తన కేంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కారు. అయితే, ఈ మూడో విడత సాయం 97,619 మత్స్యకార కుటుంబాలకు అందిందని 2021–2023 రాష్ట్ర సాధారణ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ముఖ్యమంత్రి జగన్‌ సీఎం కార్యాలయంలో బటన్‌ నొక్కి ప్రభుత్వ సాయానికి ఎంపికచేసిన బెస్త కుటుంబాల అకౌంట్ల సంఖ్యకు, బడ్జెట్‌లో పేర్కొన్న భరోసా చెల్లింపునకు తేడా ఎందుకు వచ్చిందో స్పష్టం కావడం లేదు.
* ఆర్థిక దుస్థితే అసలు కారణం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా అనుసరిస్తున్న అస్తవ్యస్థ ఆర్థిక విధానాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఫలితంగా, క్రమం తప్పకుండా వివిధ సంక్షేమ పథకాలకు కత్తెర వేయడం ఆనవాయితీగా మారిపోయింది. విస్తరిస్తున్న వృత్తి అవకాశాలు, పెరుగుతున్న జనాభా దృష్ట్యా సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య మొదటి పది పదిహేనేళ్లలో పెరుగుతూ పోవాలి. ఆర్థిక పురోగతి ఆయా వర్గాలు సాధించాక ప్రభుత్వ సాయంపై ఆధారపడేవారి సంఖ్య తగ్గాలి. కాని పథకం ప్రారంభమై నిండా మూడేళ్లు పూర్తికాకముందే మత్స్యకార భరోసా సాయం అందుకునే కుటుంబాల సంఖ్య తగ్గుముఖం పట్టడం వింతగా ఉంది. జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన దాదాపు ఆరు నెలలకు 2019 నవంబర్‌ 22న ఈ భరోసా పథకం అమలు మొదలైంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సహకార సంఘాల సభ్యులందరికీ వర్తించేలా ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రారంభించారు. మత్స్యకారులు చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసించే కోనసీమ ప్రాంతంలోని కొమానపల్లిలో సీఎం చేతుల మీదగా ఆరంభమైన ఈ కార్యక్రమం మత్స్యకారులకు ఆశారేఖగా కనిపించింది. ప్రభుత్వం అందించే సాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామనే ప్రభుత్వ ప్రకటన వారికి సంతోషాన్నిచ్చింది. తొలి విడత సాయంగా 2019 నవంబర్‌ 22న 1,02,478 కుటుంబాల ఖాతాల్లోకి పది వేల రూపాయల చొప్పున రూ.102.48 కోట్లు బదిలీ చేశారు. ఆరు నెలల తర్వాత 2020 మే 6న 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్లు మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం జమ చేసింది. 2021 మే 18న మత్స్యకారులకు భరోసా కార్యక్రమం కింద 1,19,875 కుటుంబాలకు రూ.119.87 కోట్లు జమ చేస్తూ ముఖ్యమంత్రి బటన్‌ నొక్కారు. ఈ వివరాలు గమనిస్తే, రెండున్నరేళ్ల నాటి భరోసా లబ్ధి పొందిన మత్స్యకార కుటుంబాల సంఖ్య 1,02,478 నుంచి ప్రస్తుతం 1,08,755కు పెరిగిందని ప్రభుత్వ ప్రకటన చెబుతోంది గాని మధ్యలో భరోసా సాయం పొందిన కుటుంబాల సంఖ్య 11 వేల వరకూ తగ్గడానికి కారణాలు చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో అనేక పథకాలు ప్రారంభించి, నిధుల కొరతతో అనేక పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం మన అనుభవంలో కనిపిస్తున్న వాస్తవం. మండు వేసవిలో తమ జీవనోపాధికి దూరమయ్యే మత్స్యకారుల కోసం రూపొందించిన ఈ పథకం కూడా మిగిలిన సంక్షేమ కార్యక్రమాల మాదిరిగా బక్కచిక్కిపోతుందనే అనుమానాలు వచ్చే విధంగా జగన్‌ సర్కారు వ్యవహరిస్తోంది. ఎన్నో ఇబ్బందులతో కూడిన వృత్తిలో ఉన్న సముద్రతీర మత్స్యకారుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.