ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి – జనసేనాని
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలి
ఆప్షన్లు పేరుతో మభ్యపెట్టవద్దు.
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేస్తేనే విద్యార్థులు, వారి తల్లితండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుంది. వారు చేస్తున్న డిమాండ్ లో స్పష్టత ఉంది. తమ బిడ్డలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆ విద్యా సంస్థలు నిర్వహణ సాగేలా చూడాలని తల్లితండ్రులు కోరుతున్నారు. అనంతపురం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం… ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము చదివే కాలేజీలు, స్కూళ్ళు ప్రైవేట్ విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని చెబుతూనే ఉన్నారు. కన్నవారు, విద్యార్థులు ఆందోళనకు తలొగ్గినట్లు కనిపించిన ప్రభుత్వం- మెమో ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రకటన చేసినా అందులో మతలబులే కనిపిస్తున్నాయి. ఆప్షన్ల పేరుతో విద్యార్థులను, తల్లితండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వాహకులకు ఇచ్చిన వాటిలో మొదటి రెండింటినీ బలంగా ప్రభుత్వం చెబుతోంది అంటే కచ్చితంగా ప్రభుత్వం నాలుగు జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంది అని అర్ధమవుతోంది. నాలుగు మార్గాలు చెప్పాం… విద్యాసంస్థల నిర్వాహకులు ఏదోఒకటి ఎంచుకొంటారు అంటూ విద్యా శాఖ తన బాధ్యతను తప్పించుకోకూడదు. ఎప్పటిలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగాలి అంటే జీవో 42, జీవో 50, జీవో 51, జీవో 19లను పూర్తిగా రద్దు చేయాలి. 1982నాటి విద్యాహక్కు చట్టాన్నికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆందోళనలు తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు మెమోల రూపంలో ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. విద్యార్థులకు అన్యాయమే జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.