విజయదశమి శుభాకాంక్షలు

భారతీయ పండుగలు ప్రకృతిపరంగా పరవశింపజేసి… ఆధ్యాత్మిక అనుభూతిని అందించడం మనందరికీ కరతలామలకమే! ప్రతి పండుగలోను ఒక పరమార్ధం.. ఒక ప్రయోజనం.. ఒక సందేశం నిబిడీకృతమై ఉంటుంది. శరదృతువులో ప్రారంభమై విజయదశమితో ముగిసే దేవీ నవరాత్రులు ప్రకృతి, భక్తి పారవశ్యాల సమ్మేళనమే. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో జరిగే అమ్మవారి నవరాత్రులు తెలుగు రాష్ట్రాలలో మరింత శోభాయమానంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఎక్కడ సంస్కృతీ సంప్రదాయాలు పరిఢవిల్లుతాయో అక్కడ జాతి దినదిన ప్రవర్ధమానమవుతుందని మన పెద్దలు చెప్పే మాటలు అక్షర సత్యం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారి సన్నిధానం, తెలుగు రాష్ట్రాల్లోని శక్తి పీఠాల్లో అమ్మవారికి జరుగుతున్న అలంకారాలు.. భక్తులు చేస్తున్న పూజల గురించి తెలుసుకుని తన్మయత్వం చెందాను. ముఖ్యంగా తెలంగాణాలో ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో కలిపి తొమ్మిది వర్ణాల బతుకమ్మల కొలుపు పారవశ్యాన్ని కలిగించింది. విజయదశమి అంటే రాక్షస పాలనకు చరమాంకం అంటారు. అటువంటి రాక్షస పాలన ఉన్న చోట ప్రజలను ఆ పరమేశ్వరి కాపాడాలని, అటువంటి పాలనను అంతమొందించాలని ప్రార్ధిస్తున్నాను. ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలను కలుగచేయాలని, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగు బిడ్డలందరితోపాటు భారతీయులందరికీ నా తరఫున, జనసేన తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.