హెల్త్ అలవెన్సులు వెంటనే విడుదల చేయాలి

  • ఇంచార్జ్ అడిషినల్ కమీషనర్ ని కలిసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ,
  • రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ జేఏసీ నాయకులు సోమి శంకరరావు.

గుంటూరు, పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా రావలసిన హెల్త్ అలెవెన్సులను వెంటనే విడుదల చేయాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ఆవరణలో రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు సోమి శంకరరావుతో కలిసి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ పని చేసుకుంటే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్న పారిశుధ్య కార్మికుల జీతాలను, వారికి అందవలసిన లబ్ధిని ఎందుకు నెలలు నెలలుగా వాయిదా వేస్తారో అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదని ఒక్క గుంటూరులో మాత్రమే హెల్త్ అలెవెన్సులు ఆగాయన్నారు. సమాజంలోని చెత్తాచెదారాన్ని తీసేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సమస్యలను మాత్రం పట్టించుకోవటంలో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఇది చాలా దుర్మార్గమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యమ నేత సోమి శంకరరావుతో కలిసి ఇంచార్జ్ అడిషనల్ కమీషనర్ శ్రీనివాసరావుని కలిసి సమస్యలపై చర్చించారు. ఆగిన హెల్ అలెవెన్సులతో పాటూ కోవిడ్ సమయంలో ఐదు నెలల పనిచేసిన సుమారు 500 మంది కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఇంచార్జ్ అడిషినల్ కమీషనర్ శ్రీనివాసరావు సమస్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడారు. ఆగిపోయిన హెల్త్ ఆలెవెన్సులను నాలుగైదు రోజుల్లో విడుదల చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కోవిడ్ సమయంలో పనిచేసిన వారి సమస్యను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాసరావుని కలిసిన వారిలో రాష్ట్ర రెల్లి యువజన నాయకులు సోమి ఉదయ్, ముత్యాల వెంకటేశ్వరరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.