వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుంది

• ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ పాలన అవసరం
• ఆ ప్రత్యామ్నాయాన్ని జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకువెళ్తుంది
• రాష్ట్రాన్ని రక్షించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు
• ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలకు వైసీపీ పాలనే కారణం
• పొత్తులు ప్రజలకు ఉపయోగపడాలి.. వ్యక్తిగత లభ్దికి కాదు
• వైసీపీ సవ్యంగా పాలించి ఉంటే మాకు కౌలు రైతు భరోసా యాత్ర అవసరం ఉండేది కాదు
• నంద్యాలలో మీడియాతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి విముక్తి కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ పాలన రావాలని దాన్ని జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదే తన కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు, చీలితే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్న ఉద్దేశ్యంతోనే ఆవిర్భావ సభలో ఆ మాట అన్నట్టు తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతే.. వైసీపీ మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలి తప్ప తన వ్యక్తిగత ఎదుగుదల కోసం ఏ రోజూ చూడలేదన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర మధ్యలో శిరివెళ్ళ సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “2014లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాం.. నా దృష్టిలో పొత్తు ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు నేను ఆ పొత్తులో నుంచి బయటకు వస్తాను తప్ప వ్యక్తిగత లాభాపేక్ష కోసం మాత్రం పొత్తు పెట్టుకోను. మార్చి 14న ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనడానికి వైసీపీ పాలనే కారణం. ఈ ప్రభుత్వం ఎవ్వరినీ బతకనీయడం లేదు. అందరి ఆర్ధిక మూలాలు దెబ్బకొడుతున్నారు. కౌలు రైతులు చచ్చిపోతుంటే వారికి అండగా నిలబడడం లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ లేదు. పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కరెంటు కోతలు. ఈ సమస్యలన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చాలా బలమైన ప్రత్యామ్నాయం కావాలి అందుకు చాలా మంది కలసి రావాలని భావించాను. వ్యతిరేక ఓటు చీలిపోతే పాలన మరింత దిగజారిపోతుంది. రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు చూస్తే.. శాంతి భద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. ఆడబిడ్డల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితులు వచ్చినా మాట్లాడే పరిస్థితి లేదు. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడండి అంటే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చాలా చిన్న విషయంగా మాట్లాడుతారు. పైగా బిడ్డలు చేసిన తప్పులకు తల్లే బాధ్యత వహించాలని మాట్లాడే విపరీతకరమైన ధోరణులు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తి ఉండాలి. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలసి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచాయి. అస్థవ్యస్థంగా ఉన్న వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే ఓటు చీలకూడదు. ఎంత వరకు అందరూ కలసి వచ్చి విశాల దృక్పథంతో అర్ధం చేసుకుని ప్రజలకు ఎంత భరోసా కల్పిస్తారనేది భవిష్యత్తులో తేలుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దీని మీద ఒక చర్చ జరగాలి. ప్రస్తుతం బీజేపీతోనే పొత్తులో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఇక్కడ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా వారు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాం. కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ రోజు 130 మంది కౌలు రైతులకు రూ. లక్ష చొప్పున సాయం చేయబోతున్నాం. మార్గం మధ్యలో నలుగురికి సహాయం అందించాం. జనసేన ప్రారంభం నుంచి ప్రజలకు అండగా నిలవాలనే దృక్పథం తప్ప ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలి. ప్రజల విశ్వాసం చూరగొనాలి. తద్వారా అధికారం వచ్చే దిశగా అడుగులు వేయాలి. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నాం. మేము వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది పార్లమెంటు సభ్యులు ఉండి ఎన్నో సమస్యల్ని హుందాగా పరిష్కరించి ఉండొచ్చు. అలా పరిష్కరించలేని పక్షంలో ఎందుకు చేయలేకపోయాం అనేది సంజాయిషీ చెప్పాలి. కానీ రాష్ట్రంలో మాకు సంఖ్యాబలం ఉంది. మేము ఏమైనా మాట్లాడగలం. ఏమైనా చేయగలం అన్న పద్దతిలో ప్రవర్తిస్తున్నారు. మేము నిజంగా ప్రజల పక్షాన ఉండడానికి వచ్చాం. శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి తటస్తులు సైతం రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు చూసి గగ్గోలు పెడుతున్న దుస్థితి. వైసీపీ సవ్యమైన పాలన చేయకపోవడం వల్లే జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. మేనిఫెస్టోలో కౌలు రైతు చనిపోతే రూ.7 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకే ఇబ్బంది కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీపరంగా రూ. 5 లక్షలు ఇస్తున్నప్పుడు.. ప్రజల దగ్గర శిస్తులు, పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎంత చేయాలి. రాష్ట్రంలో 90 శాతం భూమిని పండించేది కౌలు రైతులే. అలాంటి కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పంట అమ్మినా డబ్బు రాక అప్పులు పేరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
* కౌలు రైతులను వేధిస్తున్నారు
మా జేబులో డబ్బు ఇద్దామని ముందుకు వస్తే లబ్దిదారులైన కౌలు రైతుల్ని వేధిస్తున్నారు. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి వైసీపీ నాయకులు దేనికి భయపడుతున్నారు. మీరు సమస్య తీర్చరు. అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అన్నట్టు తయారయ్యారు. మా కష్టార్జితంలో కొంత ఇచ్చి 3 వేల మంది రైతులకు అండగా ఉందామని భావిస్తే వారిని బెదిరిస్తున్నారు. ఈ రోజు కూడా దారిలో ఇద్దరు రైతుల్ని ఆపేశారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో ఆగ్రహం ఎక్కువ అవుతుంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే కరెంటు కోతలు, ఉద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు, పరిశ్రమలు లేవు. ఎవరైనా మాట్లాడితే మూకుమ్మడిగా మీద పడి దౌర్జన్యం చేస్తారు. ఒక క్రమపద్దతిలో మాట్లాడే పరిస్థితులు లేవు. నోరేసుకుపడిపోయే వైసీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నాం. మీరు ఏం చేసినా మేము వెనక్కి తగ్గం” అన్నారు.

Avatar