బటన్ల సంస్కృతి అద్భుతంగా ఉంటే రైతుల ఆత్మహత్యలేమిటి?

•వైసీపీ పాలన మీద భరోసా లేకే రైతులు చనిపోతున్నారు
•ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే 170 మందికి పైగా రైతుల ఆత్మహత్య
•ఉమ్మడి కడప జిల్లాలో 20న జనసేన రైతు భరోసా యాత్ర
•ప్రతి కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ స్వయంగా సాయం చేస్తారు
•శ్రీ జగన్ రెడ్డికి మరోసారి ఛాలెంజ్ చేస్తున్నాం
•సిద్ధవటం సభలో పాల్గొనండి..
•సాయం అందుకునే వారు రైతులు కాదని నిరూపిస్తే క్షమాపణ కోరతాం
•ముఖ్యమంత్రి స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి
•సిద్ధవటంలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి గారూ…. మీ సొంత జిల్లా కడపకు వచ్చాం.. రేపటి రోజున రైతు భరోసా కార్యక్రమం చేపట్టబోతున్నాం.. ఆ కార్యక్రమానికి మీకు ఆహ్వానం పలుకుతున్నాం.. మీరుగాని, మీ ప్రతినిధులుగాని వచ్చి పాల్గొనండి.. జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా సాయం అందుకుంటున్న వారిలో ఒక్కరు కౌలు రైతు కుటుంబం కాదన్నా మీకు క్షమాపణ చెబుతాం.. చిత్తశుద్ది ఉంటే మా ఛాలెంజ్ స్వీకరించండి అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సవాలు విసిరారు. ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించనున్న కౌలు రైతు భరోసా యాత్ర కోసం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం 12 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి బైపాస్ మీదుగా ఒంటి గంట ప్రాంతంలో సిద్ధవటం సభా ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన 170 మందికి పైగా కౌలు రైతు కుటుంబాలకు స్వయంగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు స్పష్టం చేశారు. శుక్రవారం సిద్ధవటం సభా ప్రాంగణం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం జరగనున్న కౌలు రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. “ఉమ్మడి కడప జిల్లాలో జరగనున్న జనసేన కౌలు రైతు భరోసా యాత్ర విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, జిల్లాకు చెందిన పెద్దలు చాలా మంది కృషి చేస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టనటువంటి కార్యక్రమం ఇది. రైతుల్లో భరోసా నింపేందుకు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఈ జిల్లాకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి బటన్ నొక్కడంతోనే అభివృద్ధి, సంక్షేమం అద్భుతంగా జరిగిపోతున్నాయని చెబుతున్నారు. బటన్ల సంస్కృతి అద్భుతంగా ఉంటే, మీ పరిపాలన మీద భరోసా ఉంటే అంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడతారు? మీ సొంత నియోజకవర్గం పులివెందులలోనే 44 మంది కౌలు రైతులు ప్రభుత్వం నుంచి ఏ విధమైన భరోసా లభించని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి. యంత్రాంగం పని చేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి స్పందన కరువైనప్పుడే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి.
* ప్రభుత్వం కంటే మీడియా లెక్కల్లోనే వాస్తవాలున్నాయి
శ్రీ జగన్ రెడ్డే కొత్త చట్టం తీసుకువచ్చారు. రైతు ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల్లో ప్రభుత్వం తరఫున త్రిసభ్య కమిటీ వెళ్లి విచారణ జరిపి వారంలో 7 లక్షల పరిహారం అందచేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 170 పైచిలుకు కౌలు రైతుల్లో ఎంత మందికి మీ ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారం అదించింది. ఎందుకు కొంత మందికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేసి మమ అనిపించారు. ఎంతో మందిని సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకన్నా మీడియా మిత్రులు కౌలు రైతుల మరణాల గురించి నిజాయతీగా కథనాలు ప్రచురించారు. ఏ మండలంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో రాశారు. ముఖ్యమంత్రి సొంత పత్రిక సాక్షి మీడియాలో కూడా ప్రచురించారు. ఆయన సొంత పత్రికలో వచ్చిన కథనాలకు కూడా న్యాయం చేయలేదు. ఆ వివరాలన్నీ రేపటి రోజున సభలో బయటపెడతాం. కౌలు రైతు భరోసా యాత్ర అనుకోగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన సొంత నిధి నుంచి రూ. 5 కోట్లు ఇచ్చారు. వారి కుటుంబం, పార్టీ నాయకులు ఎంతో మంది కార్యక్రమానికి సాయం చేశారు. ఇప్పటి వరకు 5 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీసుకువెళ్లాం.
* స్టీల్ ఫ్యాక్టరీకి ఒక్క ఇటుకా వేసింది లేదు
ఆంధ్రప్రదేశ్ లో రైతాంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం మన బాధ్యత. ఈ రోజుకీ రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏ కారణం చేత ఇంత ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక సొంత జిల్లా కడపలో ఎంత మందికి ఉపాధి కల్పించారు? ఏ ఒక్క రైతుకీ అండగా నిలిచింది లేదు. వ్యవసాయ రుణాలు ఇవ్వరు. వ్యవసాయ రంగానికి అండగా నిలబడరు. రైతు భరోసా కేంద్రాలు అంటూ రూ. 6,300 కోట్లు ఎక్కడికి పోయాయి. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత మందికి న్యాయం చేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటింది. అక్కడ ఒక్క ఇటుక వేసింది లేదు. మీ పాలన బాగుంటే మీ సొంత జిల్లా నుంచి యువత ఎందుకు వలసలు పోతున్నారు. ఈ మూడేళ్లలో ఎంత మంది యువతకు మీ ప్రభుత్వం ఉపాధి కల్పించింది. రేపటి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తారు. ఈ ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా పరిపాలిస్తూ సంక్షేమం పేరిట గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఇద్దరు మహిళలు తమ ఇంటివారు చనిపోతే సాయం అందించలేదని కాగితాలు తీసుకువచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు. క్షేత్ర స్థాయికి మా నాయకులు వెళ్తున్నా ఇదే విధమైన స్పందన వస్తోంది.
* కౌలు రైతులు పాస్ బుక్ ఎలా తెస్తారు
శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న విషయాన్ని ఆర్టీఐ చట్టం ద్వారా ప్రతి ఎస్సీ కార్యాలయానికి లేఖలు రాసి సమాచారం తెప్పించుకున్నాం. ప్రతి ఒక్కరినీ పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే జనసేన పార్టీ ద్వారా సాయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పాస్ బుక్కు ఉందా అని అడుగుతున్నారు. అసలు ఆయనకు చిత్తశుద్ది ఉందా? కౌలు రైతుకు పాస్ బుక్కు ఉంటుందా? ఎక్కడి నుండి తెస్తారు? రైతు కుటుంబాల్లో భరోసా నింపే ఈ కార్యక్రమానికి జిల్లాలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం. సిద్దవటంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్దామ”ని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, ప్రధాన కార్యదర్శులు శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ ముకరం చాంద్, అమలాపురం ఇంచార్జి శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, పార్టీ నాయకులు శ్రీ పీవీఎస్ మూర్తి, శ్రీ హసన్ బాషా, శ్రీ ఎం.వి.రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *