అందరి చూపు ఆ మ్యాచ్‌పైనే.. కివీస్ ఓడితేనే భారత్‌కు ఛాన్స్
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా అభిమాను లంతా ఆఫ్ఘనిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌పైనే దృష్టి సారించారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నారు. ఎందుకంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి.. న్యూజిలాండ్ ఓడితే.. ఆ రెండు జట్ల ఖాతాలో 6 పాయింట్లు చొప్పున ఉంటా యి. దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు నమీబియాను చిత్తుగా ఓడిస్తే భారత్ ఖాతా లోనూ 6 పాయింట్లు జమ అవుతాయి. దీంతో మెరుగైన రన్‌రేట్ కలిగిన ఓ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనంతరం మరుసటి రోజు భారతజట్టు పసికూన నమీబియాతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్‌కు భారత్‌కు అవకాశం దక్కనుంది. ఒకవేళ అదే జరిగితే ఆఫ్ఘన్, న్యూజిలాండ్‌లను భారత్ అధిగమించి రెండో స్థానానికి ఎగబాకి సెమీస్‌కు చేరే అవకాశముంది. దీంతో టీమిండియా అభిమానులంతా నేటి మ్యాచ్‌పై దృష్టి పెట్టారు. ఇక టీమిండియా.. పాక్, కివీస్ చేతిలో ఘోర పరాజయాల్ని చవిచూసి ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్‌పై ఘన విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కివీస్ గెలుపు తథ్యం: షోయబ్ అక్తర్
న్యూజిలాండ్ ఓడితే ఎదుర్కోనున్న తీవ్ర పరిణామాలను గురించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన యు-ట్యూబ్ చానల్‌లో వివరించాడు. ”ఆప్ఘన్‌తో పోరులో కివీస్ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్ అభిమానులు ఊరుకోరన్నాడు. ఒకవేళ అలా జరిగితే మాత్రం టీమిండియా సెమీస్‌కు వెళ్లాలని న్యూజిలాండ్ కావాలనే ఓడిపోయిదంటూ పాక్ క్రీడాభిమానులు ట్రోల్స్ చేయడం ఖాయమని, అలా జరగకూడదంటే ఆఫ్ఘన్‌పై కివీస్ విజయం సాధిస్తే సరిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.