కదిలిస్తే కష్టాల జడివాన

పరామర్శకు వెళ్లినా, పరిశీలనకు వెళ్లినా ప్రజలు చెప్పే కష్టాల జడివాన మాత్రం ఆగడం లేదు. కదిలిస్తే ప్రవాహం మాదిరి ఈ ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం కొలకలూరు గ్రామాన్ని సందర్శించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎదుట పలువురు తమ కష్టాలను చెప్పుకొని, ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సాయం అందడం లేదని ఆవేదన చెందారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రభుత్వ ఆస్తులనే కాదు… ప్రజలను కూడా తాకట్టు పెడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కండీషన్స్ అప్లై ముఖ్యమంత్రి

కొలకలూరి గ్రామ పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు గ్రామ సర్పంచ్ శ్రీమతి సోప్రా ప్రీతిని, గ్రామ పెద్దలను, ప్రజా ప్రతినిధులను కలిశారు. గ్రామం పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు స్పందిస్తూ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని, సొంత డబ్బులతో చేసిన బిల్లులకు నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పనులు చేయమని అడుగుతుంటే కనీసం తల ఎత్తుకోలేని పరిస్థితి ఉందని, నిధులు రాకపోవడంతో పంచాయతీ నిర్వహణ కష్టంగా ఉందని వాపోయారు. కొలకలూరుకు తాగునీటి సమస్య ఉందని చెప్పారు. కొలకలూరు గ్రామ బాలబాలికలు బ్యాడ్మింటన్ క్రీడలో మంచి ప్రతిభ చూపుతున్నారని మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కేవలం కొందరికి మాత్రమే అందుతున్నాయని, ప్రతి సంక్షేమ పథకానికి ఏదో ఒక లిటిగేషన్ పెట్టి లబ్ధిదారులు తగ్గించేలా చేస్తున్నారని చెప్పారు. ప్రతి పథకానికి “కండిషన్స్ అప్లై” అంటూ పెట్టిన ముఖ్యమంత్రి ఈయనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లబ్ధిదారులకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయారు. శ్రీ మనోహర్ గారు స్పందిస్తూ విజయవాడ నుంచి తెనాలి పట్టణానికి ఉన్న పైప్ లైన్ ద్వారా కొలకలూరుకు నీళ్లు ఇచ్చేలా ప్రయత్నం చేద్దామన్నారు. కృష్ణా నది నుంచి కేవలం 60 శాతం మాత్రమే కేటాయించిన నీళ్లను వాడుకుంటున్నామని, కొలకలూరు గ్రామపంచాయతీకి పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తే పెద్ద ఇబ్బంది లేదన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి గురించి ఆరా తీశారు. మరింత సమర్థంగా పనిచేయాలని, జనసేన ప్రజా ప్రభుత్వంలో కచ్చితంగా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఉంటుందని చెప్పారు.

* మా జీవితాల్లో ఇసుక కొట్టారు

కొలకలూరు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త బురదగుంట రత్నం భార్య శ్రీమతి సంధ్యారాణి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మనోహర్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కష్ట సమయంలో మనోనిబ్బరంతో ముందుకు సాగాలని కుటుంబానికి ధైర్యం చెప్పారు. రత్నం కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న క్రమంలో కూలీ పనులు

లేవని, నిర్మాణరంగం పూర్తిగా నిర్వీర్యమైందని వారంలో ఒక రోజు మాత్రమే పని ఉంటుందని అక్కడి వారు చెప్పారు. తెనాలి లాంటి ప్రాంతంలోనే ట్రక్కు ఇసుక రూ.7 వేల నుంచి రూ. 8 వేల మేర లభ్యమవుతుందని, దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇసుక దోపిడీ బహిరంగం అయిపోయిందని, ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు వారి అనుచరులు ఇసుక బొక్కేస్తున్నారని అక్కడ ఉన్న కూలీలంతా శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక కళ్ళ ముందే కనిపించినా, సామాన్యుడికి దక్కడం లేదన్నారు. అది బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోందని, దీంతో భవన రంగాన్ని నమ్ముకున్న కూలీలంతా కడు పేదరికంలోకి జారిపోతున్నారని చెప్పారు. శ్రీ మనోహర్ గారు స్పందిస్తూ ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఇసుక సరఫరా విషయంలో కప్పగంతులు వేస్తోందని, ఇప్పటికీ ఒక నిర్ధుష్ట విధానాన్ని తీసుకురాకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ తర్వాత కాస్త వెనక్కు తగ్గిన సర్కారు మళ్ళీ ఇసుక పంపిణీ గాలికి వదిలేసిందన్నారు. కచ్చితంగా దీనిపై ఒక నిర్దిష్టమైన, ప్రజలకు అనుకూలమైన విధానాన్ని జనసేన ప్రభుత్వం తీసుకువస్తుందని హామీ ఇచ్చారు.

* రైతుల వద్ద లంచం తీసుకున్న ప్రభుత్వం ఇదే

కొలకలూరులో మరో కార్యకర్త కమ్మెల శ్రీమన్నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకున్న మనోహర్ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీమన్నారాయణ చిత్రపటానికి నమస్కరించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పార్టీ తరఫున కచ్చితంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు వ్యవసాయం ఏమంత బాగాలేదని, ప్రతి విషయంలోనూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ మొదలు ప్రతి విషయంలోనూ రైతులకు మోసమే జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ప్రతి విషయంలోనూ కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, మద్దతు ధర సరిగా దక్కడం లేదని మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎరువుల ధరలు పెరిగిపోయాయని పెట్టుబడి ఖర్చులు ఎక్కువయ్యాయన్నారు. ఇప్పటికే చాలామంది వ్యవసాయం వదులుకొని కూలీ పనులకు వెళ్తున్నారని, భవిష్యత్తు అంతా ఏమవుతుందోనన్న బెంగ ఉందని రైతులు చమర్చిన కళ్లతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి వారి కష్టాలు చెప్పుకున్నారు. రైతులను ఆదుకునేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు వెచ్చించి భరోసా ఇస్తున్నారని, జనసేన పాలనలో కచ్చితంగా కర్షకుడికి మంచి రోజులు వస్తాయని చెప్పారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్, వేణుమాధవ్, తెనాలి మండల పార్టీ అధ్యక్షుడు దివ్వెల మధుబాబు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.