పాలనా దక్షత లేకే పారిశ్రామిక ప్రగతి పడకేసింది

* కృష్ణా జిల్లా నుంచి కూడా ఉపాధి కోసం వలసలు పోయే పరిస్థితి
* దేశంలో రైతులకు కులాలు అంటగట్టిన ఏకైక పార్టీ వైసీపీయే
* వైసీపీ నాయకులకు వ్యక్తిగత లబ్ధి తప్ప … ప్రజల కష్టాలు పట్టవు
* వైసీపీ విముక్త ఏపీలో అందరూ భాగస్వాములు కావాలి
* మైలవరం నియోజక వర్గంలో మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

* పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ మేకల రాజు కుటుంబానికి పరామర్శ.. రూ. 5 లక్షల బీమా చెక్ అందజేత
స్వతంత్ర భారతదేశంలో రైతులకు కులాన్ని అంటగట్టిన ఏకైక పార్టీ వైసీపీయేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోమర్ గారు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు… ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక వచ్చే వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు తప్ప… రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేయాలని ఆలోచించడం లేదన్నారు. నిరుపేద కుటుంబంలోని వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే కనీసం సాయం చేయాలన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. బటన్లు నొక్కుతున్నాం.. అంతా అద్భుతం అంటున్నారు… బటన్ నొక్కే ముందే లబ్ధిదారులను వేరు చేసేస్తున్నారన్నారు. రాష్ట్రానికి వైసీపీ వల్ల ఏ స్థాయిలో నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలని, నిజాయితీతో కూడిన పరిపాలన అందించేందుకు, వైసీపీ అరాచకాలను తిప్పికొట్టేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ మేకల రాజు కుటుంబాన్ని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. శ్రీ రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజు తల్లి శ్రీమతి విజయకుమారి, సోదరుడు శ్రీ పవన్ లను ఓదార్చారు. పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు అందజేసే రూ. 5 లక్షల చెక్ ను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ… “నిజాయితీగా పని చేసే జనసైనికులను కోల్పోవడం పార్టీకి తీరని లోటు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కార్యకర్తలను సొంత కుటుంబసభ్యులుగా భావించి ఆపద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకొచ్చారు. గత రెండు రోజులుగా కృష్ణా జిల్లాలో ప్రమాదవశాత్తు మనల్ని విడిచి వెళ్లిన జనసేన పార్టీ కుటుంబసభ్యులైన నలుగురు క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున భరోసా కల్పించగలిగాం. ఉపాధి కోసం పక్క జిల్లాకు వెళ్తూ మార్గం మధ్యలో రాజు మృతి చెందడం బాధాకరం. వనరులు పుష్కలంగా ఉండే కృష్ణా జిల్లాలో కూడా ఉపాధి కరువై యువత వసలు వెళ్లే దుస్థితి వచ్చిందంటే దానికి కారణం వైసీపీ పాలనే. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నాశనం చేశారు. యువతకు ఉపాధి లేకుండా చేశారు. పారిశ్రామిక ప్రగతి పడకేసింది. మొదటి రోజు నుంచి విధ్వంసంతో కూడిన పరిపాలన చేస్తున్నారు. ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. ఇప్పుడు అదే ఇసుకను అమ్మి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.
* రైతు భరోసా కేంద్రాలు.. ఒక మోసం
అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలనే బాధ్యత ప్రభుత్వానికి లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో దాదాపు మూడువేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అందుకు కారణం ఈ ప్రభుత్వం నుంచి వారికి భరోసా లేకపోవడమే. అంతమంది రైతులు చనిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. రైతు భరోసా కేంద్రాలు ఒక మోసం. రూ.6300 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. ఏ శాఖలోనూ పరిపాలన పారదర్శకంగా సాగడం లేదు. రైతులను కూడా ఏ కులం? ఏ పార్టీ అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కలిసి రావాలి. అందులో భాగంగానే వ్యతిరేక ఓటు చీల్చకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయం సందర్భం వచ్చినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు” అని అన్నారు.
* పార్టీ దృష్టికి మత్స్యకారుల సమస్యలు
మైలవరం నియోజకవర్గంలోని కృష్ణానది తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు తమ సమస్యలను శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైన చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదని, నదిలో చేప పిల్లలు వేయడం, వలలు, పడవలు ఏర్పాటు చేయడం వంటివి పూర్తిగా విస్మరించారని తెలిపారు. డీజిల్ సబ్సిడీ వ్యవహారంలోనూ అన్యాయం జరుగుతుందని చెప్పారు. చేపల వేటకు సంబంధించిన పరికరాల కొనుగోలు కోసం ఇచ్చే బ్యాంకు రుణాలు కూడా సక్రమంగా అందడం లేదని వివరించారు. మత్స్యకార సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనోహర్ గారు హామీ ఇచ్చారు.
* మృతి చెందిన జనసేన నాయకుల కుటుంబాలకు పరామర్శ
నందిగామకు చెందిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ తోట మురళి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ మనోహర్ గారు శ్రీ తోట మురళీ కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మురళీకృష్ణ చేసిన సేవలను కొనియాడారు. భార్య శ్రీ మతి పద్మావతి, కుమారుడు త్రిదేవ్ లకు ధైర్యం చెప్పారు. అంతకుముందు కంచికచెర్ల మండలం కేసర గ్రామానికి చెందిన శ్రీ షేక్ పెద్దబాజీ కుటుంబాన్ని కూడా మనోహర్ గారు పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ , కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ అధికార ప్రతినిధి శ్రీ అక్కల రామ్మోహన్ రావు, పార్టీ నాయకులు శ్రీ బొలియశెట్టి శ్రీకాంత్, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి కురిమెళ్ల లక్ష్మి సరస్వతి, శ్రీమతి చింతల లక్ష్మి కుమారి, బొలిశెట్టి తేజ, పండమనేని శ్రీనివాస్, శనక ప్రసాద్, కాసర్ల ఫణివంశీ, బూరగడ్డ శ్రీకాంత్, బొలిశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *