ఐపీఎల్- 14: పోరాడి ఓడిన హైదరాబాద్

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. గత ఐదు సీజన్‌లలో నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఈసారి శుభారంభం లభించలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ బృందం 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా 80, రాహుల్‌ త్రిపాఠి 53 రన్స్ తో మెరుపులు మెరిపించారు. రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే చేయడంతో కోల్‌కతా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. మనీశ్‌ పాండే 61 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. బెయిర్‌స్టో అర్ధ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చలేకపోయారు. 10 పరుగులకే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్, వృద్ధిమాన్‌ సాహా వంటి కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత పాండే, బెయిర్‌స్టో జోడీ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆరంభం నుంచి కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. మనీశ్‌ పాండే 61 పరుగులు చేయగా.. బెయిర్‌స్టో 54 పరుగులతో దూకుడుతో ఆడారు. హాఫ్ సెంచరీలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. సన్ రైజర్స్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.