దేశంలో అత్యంత సంపన్న సీఎం ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడటం దౌర్భాగ్యం

• ట్విటర్లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో అందరి కంటే ‘ఎ క్లాస్’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల సంపద మొత్తం కలిపినా అంతకంటే ఎక్కువ సంపద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే ఉంటుంది అన్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ గారు చేసిన ట్వీట్స్ అనువాద రూపమిది.
1) ఆక్సిమొరాన్‌ (నామవాచకం) – అర్థం – పొంతనలేని పదాల కలయిక
ఉదాః నిరుపేద ప్రజలు నివసించే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ధనిక ముఖ్యమంత్రి అన్న చందంగా..
సూక్ష్మార్ధం: మన ముఖ్యమంత్రి సంపద ఎంతంటే దేశ ముఖ్యమంత్రుల సంపద మొత్తం కలిపినా అంత కన్నా ఎక్కువే.. అందుకే ఏపీ సీఎం, అందరికంటే ‘ఏ క్లాస్‌!’
2) ఆంధ్రప్రదేశ్‌లో సంపద ఉన్నవారు, లేనివారు అనే క్లాసులు లేనే లేవు. ఎందుకంటే వైసీపీ క్రూరత్వంతో రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చింది.
భూముల నుంచి ఇసుక వరకూ… మద్యం నుంచి మైన్స్‌ వరకూ.. అడవుల నుంచి కొండల వరకూ.. పేపర్‌ నుంచి ఎర్రచందనం వరకూ.. రాష్ట్రం నుంచి వచ్చే ప్రతీ పైసా మన సంపన్న ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది… కాబట్టి.. ఆయన నిజంగా ‘క్లాసిక్’.
3) ఏపీలోని పేద ప్రజలను దీనాతిదీనులుగా వైసీపీ మిగిల్చింది. వారి జీవితాలను, ఆత్మ గౌరవాన్ని, కష్టాన్ని కేవలం కొన్ని వందల రూపాయల బిచ్చంతో అమ్మేసింది!
ఏపీలోని మధ్యతరగతి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వారిని పన్ను చెల్లించే నోరెత్తలేని సేవకులుగా పరిగణిస్తోంది!
ఏపీ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారు.
ఇదే వైసీపీ యెక్క ‘మాస్టర్‌ – క్లాస్‌’!
4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకువచ్చింది కదా ఇక ఎవరికి కావాలి ఈ దావోస్‌.. మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నూడిల్స్‌ సెంటర్‌, టీ స్టాల్స్ ఎప్పుడో ప్రారంభించేశారు. ఇక ఐటీ కంపెనీల బ్రాంచీల ఏర్పాటు మాత్రమే మిగిలింది. ఇదొక మరో ‘క్లాస్‌’ చర్య!
అరకులో బాక్సైట్‌ మైనింగ్‌ను సమర్థిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ‘క్లాస్‌ వార్‌’ అంటూ కామ్రేడ్ చారు ముజుందార్‌, కామ్రేడ్ నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారి గురించి మాట్లాడుతారు. ఏమిటీ దౌర్భాగ్యం!