ముస్లిం మైనారిటీలకు జగన్‌ సర్కారు మొండిచేయి

*ఎన్నికల హామీలన్నీ గాలికి
*పాత పథకాలన్నింటికీ చెల్లుచీటీ
*హైకోర్టులో కేసుతో బట్టబయలు
*ముహూర్తం చూసుకొని మొదలెడతామంటూ ఇప్పుడు సన్నాయినొక్కులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సంక్షేమాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించింది. తాను అధికారంలోకి వచ్చిన 2019 మే నెల నాటికి అమలులో ఉన్న ముస్లింల సంక్షేమ పథకాలను మెరుగుపరుస్తామన్న హామీని జగన్‌ పార్టీ తుంగలో తొక్కింది. అంతేకాదు, అలాంటి స్కీముల్లో చాలా వాటి అమలు నిలిపివేసింది. ఆడపిల్లల పెళ్లికి సాయంగా ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు అందించే దుల్హన్‌ పథకం అమలు నిలపివేయడంపై ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ కారణంగా ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై జగన్‌ సర్కారు జవాబు చెబుతూ, నిధుల కొరత కారణంగా దుల్హన్‌ అమలు చేయడం లేదని హైకోర్టుకు వివరించింది. మైనారిటీల హక్కుల పరిరక్షణ సమితి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు కిందటి నెల ప్రభుత్వ అసిస్టెంట్‌ ప్లీడర్‌ను ఆదేశించింది. దీంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీపై జగన్‌ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అర్ధమౌతోంది. ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన హైకోర్టు బెంచి మైనారిటీలపై తమ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఎంతో బట్టబయలు చేయడంతో జగన్‌ మంత్రివర్గం తన తప్పును చక్కగా సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ‘దుల్హన్‌ పథకం అమలును కిందటి ప్రభుత్వమే (టీడీపీ) నిలిపి వేసింది. 2017, 2018లో దీని కింద చేసుకున్న దరఖాస్తులను అప్పటి సర్కారు పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఆ అప్లికేషన్లు క్లియర్‌ చేసి, మళ్లీ దుల్హన్‌ ప్రారంభించడానికి ఎంత ఖర్చవుతుందో మదింపు చేశాక మంచి రోజు చూసుకుని మొదలుబెడదాం,’ అని సీఎం జగన్‌ జూన్‌ చివరి వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చెప్పడం దిగ్భ్రాంతి కలిగించింది.
*సాయం రెట్టిపు హామీ ఏమైంది?
తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం యువతుల పెళ్లిళ్లకు సాయం కింద దుల్హన్‌ పథకంతో అందిస్తున్న రూ.50 వేల సాయం మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని జగన్‌ ప్రకటించారు. కాని, 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసలు ఈ పథకం అమలు చేయడమే మాని వేసింది. అంతేకాదు, మైనారిటీల కోసం ఉన్న అనేక కార్యక్రమాలను కూడా కొనసాగించడం లేదు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత మహ్మద్‌ ఫారూఖ్‌ షిబ్లీ పిటిషన్‌ వేసే వరకూ దుల్హన్‌ గురించి ప్రభుత్వం నోరెత్తి మాట్లాడడక పోవడం విచారకరం. పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్నే కొనసాగించలేని పాలకపక్షం తాము అధికారంలోకి వచ్చాక సాయం మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల హామీల్లో చేర్చి విస్మరించడం అత్యంత గర్హనీయం.
* ‘మదింపు’ పేరుతో విదేశీ విద్య పథకానికీ మంగళం
దుల్హన్‌ మాదిరిగానే విదేశీ విద్య పథకం కూడా వైఎస్సార్సీపీ హయాంలో అమలుకు నోచుకోవడం లేదు. మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్య అందించేందుకు ఏపీలో 2016 నుంచి అమలు చేస్తున్న పథకం అమలు కూడా నిలిచిపోయింది. ఈ పథకం కింద సాయాన్ని 2018లో రూ.15 లక్షలకు పెంచారు. పేద ముస్లిం విద్యార్థులకు మేలు చేసే ఈ స్కీమును కూడా దాని అమలు తీరును సమీక్షించి మదింపు చేయడానికే నిలిపి వేసినట్టు జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు విన్నవించుకుంది. ఈ అంశంపై కూడా షిబ్లీ, మరో నేత షేక్‌ ఖాజా వలీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగానే జగన్‌ ప్రభుత్వం తన వివరణ ఇచ్చింది. అంతేగాని, అంతకు ముందే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు పోవడానికి ప్రభుత్వ పథకం కింద ప్రయత్నించిన విద్యార్థులు వందలాది మందికి వీసాలు రాలేదని, అయినా వారికి సాయం అందించారని, అందుకు మొత్తం స్కీమును సమీక్షించడానికి దాని అమలు నిలిపి వేశామని ప్రభుత్వ ప్లీడరు కోర్టులో చెప్పారు. అంతేగాని విదేశీ విద్య పథకం సజావుగా అమలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
* ‘తోఫా’నూ తుంగలో తొక్కారు
ధనిక, మధ్య తరగతి ముస్లింలతో సమానంగా తమ పండగలు సంతృప్తికరంగా చేసుకోవడానికి పేదలకు ప్రభుత్వ సాయంగా పండగ సరకులు, వస్తువులు సమకూర్చే తోఫా పథకాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మైనారిటీలకు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకునే వైఎస్సార్సీపీ సర్కారు గత మూడేళ్లుగా ముస్లిం సోదరులకు రంజాన్‌ పండగ సందర్భంగా హామీ ఇచ్చినవి అందించడం లేదు. ఏటా పది లక్షల ముస్లిం కుటుంబాలు పండగ సాయం అందుకునే రంజాన్‌ తోఫాను జగన్‌ సర్కారు గత మూడేళ్లుగా అమలు చేయడం మాని వేసింది. ఏపీలో 2019లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మసీదుల నిర్మాణం, వాటి మరమ్మతులు కూడా తగ్గిపోయాయి. దీనికి కారణం ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడమే. జగన్‌ పాలన మొదలయ్యాక కేవలం షాదీ ఖానాలకు మాత్రమే రూ.10 కోట్లు ఇచ్చింది. దీంతో ఇది వరకే ప్రారంభించిన ఇతర నిర్మాణాలు చాలా వరకు నిలిచిపోవడంతో ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడున్నర వేలకు పైగా ముస్లిం ప్రార్థనా సంస్థలున్నాయి. 1300కు పైగా మసీదులు, 316 దర్గాలు ఉన్నాయి. వీటి ఆలనాపాలన చూడడానికి, వాటి మరమ్మతులకు ప్రభుత్వం నుంచి సాయం రెండు మూడేళ్లుగా ఏ మాత్రం అందడం లేదు.
*ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఊసే లేదు
ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ హామీ మరిచిందని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ ఊరూరా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రాగానే ఇస్లామిక్‌ బ్యాంక్‌ స్థాపిస్తామని వైఎస్సార్సీపీ వాగ్దానం చేసింది. అయితే, పాలన పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటుతున్నాగాని జగన్‌ ఈ ధార్మిక బ్యాంక్‌ ఏర్పాటు సంగతి పట్టించుకోవడం లేదు. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వడ్డీ లేకుండా రుణాలు సమకూర్చే ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తే ఈ మైనారిటీ వర్గంలో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. నిరుద్యోగం తగ్గిపోతుంది. కాని, తన ప్రత్యర్థి పార్టీని దుయ్యబడుతూ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో సీఎం జగన్‌ ఘోరంగా విఫలమయ్యారు.
*మైనారిటీ యువత ఉపాధి పథకాలకూ గ్రహణమే
ముస్లింలు సహా అల్పసంఖ్యాకవర్గాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన అనేక పథకాలను కూడా జగన్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ పార్టీ అధికారంలోకి రాక ముందు ఏపీలో దుకాన్, మకాన్‌ పథకాల పేరుతో ముస్లిం యువతను ఆదుకోవడానికి స్కీములు అమలులో ఉండేవి. ఈ పథకాల కింద స్వయం ఉపాధితోపాటు నివసించడానికి మైనారిటీలు దుకాణాలు, ఇళ్ళను కలిపి నిర్మించుకునేవారు. ఈ రెండు పథకాలూ ఇప్పుడు ఆగిపోయాయి. ఇంకా నిరుద్యోగ ముస్లిం యువకుల కోసం ఎయిర్‌ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్, ఆటోమొబైల్‌ రంగంలో డ్రైవింగ్, మరమ్మతుల పని, ఇంకా వెబ్‌ డిజైనింగ్, బుక్‌ పబ్లిషింగ్‌ వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే అనేక కార్యక్రమాలు ఉండేవి. వాటన్నింటినీ ప్రభుత్వం మూలనపడేసింది. ఈ రంగాలకు సంబంధించి స్వయం ఉపాధి యూనిట్లకు బ్యాంకు రుణాలు ఇప్పించే అనేక పథకాలు ఆగిపోయాయి. ఈ పథకాల కింద గతంలో ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షల రుణం వచ్చేది. ప్రభుత్వం అందులో లక్ష రూపాయల సబ్సిడీ కల్పించేది. ఇలాంటి ఉపాధి పథాకాలన్ని కూడా జగన్‌ హయాంలో అటకెక్కాయి. అసలే కొవిడ్‌–19 ప్రభావంతో ఉపాధి అవకాశాలు కోల్పోయిన ముస్లిం యువత ఈ పథకాల అమలు నిలిపివేతతో ఇబ్బందులు పడుతోంది. ఇలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల హామీలను అమలు చేయకపోగా, పాత పథకాలను సైతం నిలిపివేయడం ఆంధ్రప్రదేశ్‌ మైనారిటీల్లో తీవ్ర క్షోభకు కారణమౌతోంది.