జనసేనానికి ఉభయ గోదావరి జిల్లాల్లో జన నీరాజనం

• రాజమండ్రి నుంచి నరసాపురం వరకూ కిక్కిరిసిన రహదారులు
• అడుగడుగునా హారతులు పట్టి స్వాగతించిన మహిళలు
• మత్స్యకార అభ్యున్నతి సభకు భారీ ర్యాలీగా తరలివచ్చిన జనసేనాని
పవన్ కళ్యాణ్
• రావులపాలెంలో పవన్ కళ్యాణ్ కి వలను బహూకరించిన మత్స్యకారులు
• అస్తవ్యస్తంగా ఉన్న రహదారిని పరిశీలిస్తూ ప్రయాణం
• ఐదు గంటలకు పైగా సాగిన ర్యాలీ
• జనసేన బ్యానర్లు, పవన్ కళ్యాణ్ కటౌట్లతో నిండిన ఉభయ గోదావరి జిల్లాలు

నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభ కోసం వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ శ్రేణులు, మహిళలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆయన యాత్రకు సంఘీభావం తెలుపుతూ దారిపొడుగునా మహిళలు బారులు తీరి హారతులు పట్టారు. వేలాదిగా తరలివచ్చిన జనసైనికులు జనసేన జెండాలు రెపరెపలాడిస్తూ ఆయనతో పాటు రాజమండ్రి నుంచి నరసాపురం వరకు ర్యాలీ నిర్వహించారు. మత్స్యకార అభ్యున్నతి యాత్ర కోసం ఉదయం పవన్ కళ్యాణ్, పీఏసీ సభ్యులు నాగబాబు తో కలసి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకోగా, పార్టీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు పితాని బాలకృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్, పార్టీ నేతలు మేడా గురుదత్ ప్రసాద్, డి.ఎం.ఆర్. శేఖర్, బండారు శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, పాటంశెట్టి సూర్యచంద్ర తదితరులు స్వాగతం పలికారు. వందలాది బైకులతో మధురపూడి నుంచి వేమగిరి వరకు ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి నుంచి పార్టీ శ్రేణుల జయజయధ్వానాల మధ్య ముందుకు సాగిన జనసేనాని పై మహిళలు అడుగడుగునా పూలవర్షంతో స్వాగతం పలికారు. గాడాల, కొంతమూరు, లాలాచెరువు జంక్షన్, కడియపుంక, పొట్టిలంక, జొన్నాడ, రావులపాలెంలో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి జనసేన నినాదాలతో హోరెత్తించారు. జాతీయ రహదారి మొత్తం జనసేన శ్రేణులతో నిండిపోయింది. రావులపాలెం దగ్గర మత్స్యకారులు వల బహుకరించారు. రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలు సైతం జనసేనానికి సంఘీభావంగా వచ్చిన ప్రజలతో కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరికీ అభివాదం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.
• సిద్ధాంతం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా శ్రేణుల ఘనస్వాగతం
జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా సిద్ధాంతం బ్రిడ్జి దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించగా ఆ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్, తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికారు. మేళతాళాలు, బాణసంచా పేలుళ్ల మధ్య నరసాపురం వైపు కదిలారు. అక్కడి నుంచి పెనుగొండ, మార్టేరు, పాలకొల్లు మీదుగా పవన్ కళ్యాణ్ నరసాపురం చేరుకున్నారు. పెనుగొండ, పాలకొల్లు, నరసాపురం సెంటర్లలో దారిపొడుగునా జనసేనాని పై పూల వర్షం కురిసింది. దారిపొడుగునా దండలతో ఆయన వాహన శ్రేణి నిండిపోయింది.
• గోతుల రహదారి పరిశీలిస్తూ ప్రయాణం
సిద్ధాంతం నుంచి నరసాపురం వైపు వచ్చే రహదారి గోతులమయంగా మారింది. వాహనంపైన కూర్చుని పాడైన రహదారిని పరిశీలించారు. ప్రయాణానికి ఏ మాత్రం అనుకూలంగా లేని విషయం తెలిపేందుకు పాలకొల్లు వరకు సుమారు 30 కిలోమీటర్లు వాహనంపై నిలబడి ప్రయాణించారు. మార్గం మధ్యలో ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో జనసేనానికి అందచేశారు. నరసాపురం జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్న జేఏసీ సభ్యులు జనసేన పార్టీ తరఫున మద్దతు కోరుతూ ప్లకార్డుల ద్వారా పవన్ జనసేనానికి విన్నవించారు.
• జనసేనాని కటౌట్ కి 300 లీటర్ల పాలతో అభిషేకం
మత్స్యకారుల తరఫున గళం విప్పడానికి నరసాపురం విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ పై మత్స్యకార సోదరులు నగరం మొత్తం పవన్ కళ్యాణ్ కటౌట్లు, భారీ హోర్డింగులతో నింపివేశారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన 70 అడుగు భారీ కటౌట్ కి 300 లీటర్ల పాలతో అభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు.
• మీ అందరి కోసం పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తారు: నాగబాబు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు మాట్లాడుతూ “మత్స్యకారుల సమస్యల మీద అవగాహన కోసం ఈ సభకు వచ్చాను. మత్స్యకార సోదరులంతా బాగుండాలి. సమస్యల నుంచి గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజా సమస్యలపై రాజీ లేని యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టికి మీ సమస్య వచ్చిన తర్వాత దానికి 100 శాతం పరిష్కారం లభిస్తుందని నాకు నమ్మకం ఉంది. మత్స్యకారుల సమస్య పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తారు. మీ అందరి కోసం ఆయనతో పాటు మేము కూడా యుద్ధం చేస్తాం” అన్నారు.
• మత్య్సకార గ్రామాల్లో తాగేందుకు నీళ్ళు కూడా లేవు: బొమ్మిడి నాయకర్
పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ “మత్స్యకారులు నివసిస్తున్న తీరప్రాంత గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవు. తాగటానికి మంచినీరు కూడా లేకపోవడం మా దౌర్భాగ్యం. 197 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక్క జెట్టీ కూడా లేకపోవడంతో అక్కడి మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. డంపింగ్ యార్డు వల్ల గోదావరి తీరం కాలుష్యానికి గురవుతోంది. వ్యర్ధాలు నదీ జలాల్లో కలిసిపోవడం వల్ల మత్స్య సంపద నశించి మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్నారు. జనసేన పార్టీ ఈ నెల 13వ తేదీన మొదలుపెట్టిన ఈ యాత్రకు విశేష స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి పోరాడాలనే సంకల్పంతో ఉన్నారు” అన్నారు. జాతీయ మత్స్యకారుల సంఘం ఉపాధ్యక్షులు ప్రభాకరన్ గారు మాట్లాడుతూ “దేశానికి సైనికుడు ఎలా రక్షణ కల్పిస్తున్నాడో… సముద్ర తీరానికి మత్స్యకారుడు అలా రక్షణ కల్పిస్తున్నాడు. అలాంటి మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం ర్యాలీ, పాదయాత్ర, సభలు నిర్వహిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడికి అండగా ఉండటం మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217తో ఇన్ ల్యాండ్ ఫిషింగ్ చేసే లక్షలాది మంది మత్స్యకారుల ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడనుంది. వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి” అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి మాట్లాడుతూ మత్స్యకారుల కష్టాలను వివరించారు.