వర్షం వస్తే మునకే – వేములపల్లి జగనన్న కాలనీలో జనసేన

మండపేట, మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి జగనన్న కాలనిలో వర్షం వస్తే ముంపు తప్పదని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆరోపించారు. జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనసేన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా మండపేట మండలం వేములపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలని వద్ద జనసేనపార్టీ చేపట్టిన జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో జనసేన సామాజిక పరిశీలన నిర్వహించారు. అనంతరం ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులు ఇబ్బందులు తెలుసుకున్నారు. న్యాయం జరిగేవరకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట పట్టణానికి చెందిన నిరుపేదలకు వేములపల్లి లే అవుట్ లో స్థలాలు ఇచ్చారన్నారు. దాదాపు 15 కిలో మీటర్ల దూరంలో స్థలం ఇచ్చి అక్కడ వెంటనే నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులను బెదిరించి కట్టిస్తున్నారని ఆరోపించారు. దూరం భారం కాగా నిర్మాణం సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇక్కడ కొందరు దళారులు రాబందులుగా తయారై లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మూడో అప్షన్ ఏమైందో తెలియదని దుయ్యబట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలోచన రహిత నిర్ణయం వల్ల ఆ లేఅవుట్ పల్లంగా ఉందని మేరక చేయడం లో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చిన్న పాటి వర్షానికే కాలని మునిగి పోతుందని, భవిష్యత్ లో ఇళ్ళు నిర్మాణం పూర్తి అయితే ఇక్కడ డ్రైనేజీ వాడకంతో కాలని చెరువు మాదిరి అవుతుందని ఆందోళన చెందారు. మండపేట మండలంలో రాత్రి పగలు తేడా లేకుండా క్వారీ అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలు సాగుతున్న తీరును ఆయన తప్పు బట్టారు. దీనిపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆయా క్వారీల వద్దకు జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్లి వాటిని మూయించి వేస్తామని హెచ్చరించారు. క్వారీ తవ్వకాలకు వంత పాడుతున్న అధికారులను సైతం శంకరగిరి మాణ్యాలు పట్టిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.