కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ జనసేన
* కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ ప్రధాన ఆలోచన
* క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేసిన పార్టీ పీఏసీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు
భారతదేశ రాజకీయ వ్యవస్థలో క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా అందజేస్తోన్న ఏకైక పార్టీ జనసేన అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం గురించి ఆలోచిస్తారని తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు వారిద్దరి చేతుల మీదుగా ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్త కావేటి మురళీ కృష్ణ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్త బి. విజయ్ నాయుడు కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక కార్యకర్త సాగి చిన్న వీరయ్యకు, ఉమ్మడి ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక కార్యకర్త శ్రీ ఈడిగం రాజేందర్ కు రూ. 50 వేలు మెడికల్ రియంబర్సుమెంటు చెక్కులను అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక కార్యకర్త భూక్యా సతీష్ నాయక్ కు రూ. 45,190 లు, కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక కార్యకర్త శ్రీ దాడి అనీల్ కుమార్ లకు రూ. 41,999లు చొప్పున మెడికల్ రియంబర్సుమెంటు చెక్కులు అందజేశారు.
* మీ కుటుంబానికి అండగా ఉంటాం
జనసేన పార్టీ సిద్ధాంతాలు , పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మొదటి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తున్న కర్నూలు జిల్లాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త సయ్యద్ వలి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించుకునే వలి మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురి చేసింది. ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ , పీఏసీ సభ్యులు నాగబాబు చేతుల మీదుగా వలి భార్య శ్రీమతి సయ్యద్ బీజాన్ బీకి అందజేశారు. పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నేతలు శ్రీమతి రేఖ గౌడ్, రాధారం రాజలింగం, లక్ష్మణ్ గౌడ్, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.