రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేసే సమగ్ర ప్రణాళిక జనసేన దగ్గర ఉంది

* మూడేళ్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
* రైతుల కోసం ఇచ్చిన జీవోలు అమలు చేయడం లేదు
* పరిపాలనపై పట్టు లేని ముఖ్యమంత్రి ఉండడం విచారకరం
* కులాలను చూసి రైతు భరోసా సాయం ఇవ్వడం దుర్మార్గం
* డ్రిప్ సబ్సిడీ, పంటల రాయితీలు ఎత్తేసారు
* ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడతగా 41 మంది రైతు కుటుంబాలకు రూ.లక్ష సాయం
* చింతలపూడిలో మీడియాతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకొని .. మళ్లీ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఒక అద్భుతమైన ప్రణాళిక జనసేన పార్టీ వద్ద ఉందని.. దానిని కచ్చితంగా భవిష్యత్తులో అమలు చేస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. పరిపాలనపై పట్టు లేని ముఖ్యమంత్రి చిన్న స్థాయి ఆలోచనలతో కాలం గడుపుతున్నారని, రైతులకు అండగా ఉంటామని ఎన్నో మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయి తర్వాత వాటన్నిటిని మర్చిపోయారని తెలిపారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపుడి పర్యటన కోసం వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ “రైతులకు అవసరమైన కనీస మద్దతు ధర, సబ్సిడీ, గిడ్డంగులు, వసతులు వంటి అంశాలపైన దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి కేవలం పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోవడం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న ఆలోచనలు మానుకోవాలి. శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రలో భాగంగా 41 మందికి సహాయం అందించనున్నారు. పెదవేగి మండలం జానంపేటలో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందించడం తో మొదలయ్యే యాత్ర ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడి వరకు సాగుతుంది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం గత మూడేళ్లలో ఉభయగోదావరి జిల్లాల్లో 87 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్లకి ప్రభుత్వ సాయం కాదు కదా.. కనీసం అధికారులు ప్రజా ప్రతినిధుల పరామర్శ కూడా లేదు. కొంతమందికి మాత్రం వైయస్సార్ బీమా పథకం కింద అడపాదడపా సాయం అందించి వదిలేస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడిన రైతులకు పూర్తి సాయం అందాలి. గత మూడేళ్లలో రాష్ట్రంలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలున్నాయి. 2019 లో 1019 మంది, 2020లో 899 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివరాలు నమోదయ్యాయి. 2021 కి సంబంధించి వివరాలు ఇచ్చేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల గుంటూరు, కృష్ణా జిల్లాలో ఐదు ఆత్మహత్యలు నమోదు కాలేదని మా దృష్టికి వచ్చింది. రైతుల ఆత్మహత్యలు కూడా నమోదు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అనంతపురం జిల్లాలో గత మూడేళ్లలో 170 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే రైతు భరోసా యాత్ర మొదటి విడతలో 30 మందికి పార్టీ తరఫున సహాయం అందించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బు రూ. ఐదు కోట్లను విరాళంగా ఇచ్చారు. రైతు భరోసా కల్పించేందుకు యాత్ర దోహదపడుతుంది. రైతులను మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం. వారికి వచ్చే కష్టం మా కష్టంగా భావించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిని ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వాలని చేస్తున్న యాత్ర ఇది. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించే రైతు కుటుంబాలకు మాత్రమే డబ్బులు ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరికి సహాయం అందాలి.
* జీవో 43, 102 ఏమయ్యాయి?
కౌలు రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 43, జీవో 102 అమలు ఏమయిందో ప్రభుత్వం వివరణ చెప్పాలి. ఈ జీవో నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఏడు లక్షల రూపాయల పరిహారం అందాలి. అధికారులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వాలి. అవేం జరగడం లేదు. రైతుల పక్షపాతి అని చెప్పి కేవలం చేతులు దులుపుకునే విధంగా లక్ష సాయం చేసి మభ్య పెడుతున్నారు. కనీసం రైతుల మరణాలను అధికారికంగా లెక్కించే ఏర్పాటు చేయడం లేదు. రైతు ప్రభుత్వం మాది అని చెప్పుకున్న ముఖ్యమంత్రి… ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఎన్నో వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి వారికి అవసరమైన సమయంలో మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేశారు. బోర్లు వేసి నష్టపోతున్న రైతులను కనీసం ఆదుకునే ఆలోచన లేదు. రైతు భరోసా కేంద్రాల పేరుతో 6 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఆ డబ్బులు రైతులకు తగిన విధంగా ఇచ్చి ఉంటే ఎంతో మేలు జరిగేది.
* రైతు సాయంలో కులాలతో సంబంధం ఏంటి?
అన్నం పెట్టే రైతన్నకు కులాలతో ఏంటి సంబంధం.? అక్కడ కూడా కులాలను రెచ్చగొట్టి ఆనందం పొందాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. కులాలతో సంబంధం లేకుండా కేవలం భూమిని నమ్ముకొని అన్నదాత సాగు చేస్తాడు. పదిమందికి అన్నం పెడతాడు. రైతు భరోసా సాయం విషయంలో కూడా కులాలను చూసి ప్రభుత్వం సాయం చేయడం సిగ్గుచేటు. ఇలాంటి పనికిరాని ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలి. కులాన్ని చూడకుండా ప్రభుత్వం సాయం అందించాలి. రైతుల పొలాలను అడిగి సాయం చేసే పద్ధతి కాదు. కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం కౌలు రైతులకు కార్డులు అందాయి. వారికి మేలు జరిగింది. ప్రభుత్వం నుంచి నేరుగా పంట కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల గుర్తింపు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. భూమి యజమాని నుంచి 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలని కచ్చితమైన నిబంధన తీసుకువచ్చారు. యజమాని రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తారు? దీనివల్ల ఈ-క్రాప్ నమోదు లేదు.. పంటనష్టం కూడా రావడం లేదు. కనీసం కౌలు రైతులను గుర్తించకుండా వారిపై ప్రేమను నటిస్తోంది ఈ ప్రభుత్వం. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల పంట నష్టం వచ్చినప్పుడు వారికి అందాల్సిన సాయం కూడా అందడం లేదు. దీంతో సాగు కోసం తీసుకువచ్చిన సొమ్ము అప్పులకుప్పగా మారి… వాటిని తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
* మా దగ్గర ప్రణాళిక ఉంది
పార్టీ ఆవిర్భావం రోజు జరిగిన ఇప్పటం సభలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పారు. కేవలం మాటల్లో చెప్పడం కాదు పార్టీ వద్ద దీనికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. కచ్చితంగా అధికారంలోకి వస్తే భవిష్యత్తులో అమలు చేస్తాం. ప్రతి రైతును ఆదుకునేందుకు, వారి కష్టం వృధా పోకుండా చూసేందుకు జనసేన పార్టీ నిబద్ధతతో పని చేస్తుంది. రైతుల కష్టాలు తెలిసిన మనిషిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన మానవతా దృక్పథంతో చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతం కావాలి. మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ రైతాంగం కళ్ళలో వెలుగులు చూడాలి. ముఖంలో చెరగని చిరునవ్వు కనిపించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ సస్యశ్యామలం చేసేందుకు జనసేన పార్టీ నిబద్దతతో పనిచేస్తుంద”న్నారు. మీడియా సమావేశంలో పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు శ్రీ మేకా ఈశ్వరయ్య, శ్రీ రెడ్డి అప్పలనాయుడు, శ్రీ విడివాడ రామచంద్రరావు, శ్రీ కరాటం సాయి, శ్రీ చిర్రి బాలరాజు, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీ ఇళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.