పతనమవుతున్న వ్యవస్థలకు ప్రత్యామ్నాయం జనసేన

*పరిశ్రమలు మూత పడుతున్నా, రహదారులు కుంగిపోతోన్నా పట్టించుకొనే వారు లేరు
*వైసీపీ పాలనలో కుదేలవుతున్న ప్రజానీకం
*చిత్తూరు జిల్లా నాయకులతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పతనమైపోతున్న వ్యవస్థలను కాపాడి సరైన దిశలో నడిపించాలి అంటే జనసేన పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయ మార్గమనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్లు జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేసారు. చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు, జనసైనికులు శ్రీరామ్ లోచన్, భానుప్రసాద్, విశ్వ తేజ సదుం, గల్లా రూపేష్, జిల్లెల భాను ప్రసాద్ శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబు గారిని ప్రత్యేకంగా కలిసారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పలు సమస్యలను గురించి శ్రీరామ్ లోచన్ ఫొటో, వీడియో ప్రొజెక్టర్ ద్వారా నాగబాబు గారికి వివరించారు. చిత్తూరు జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతంగా గొప్ప పేరు మినహా సమస్యల విషయంలో అత్యంత దారుణమైన స్థితిలో చిత్తూరు జిల్లా పరిసరాలు ఉన్నట్లు నాగబాబు గారి దృష్టికి తీసుకు వచ్చారు. చిత్తూరు జిల్లాకు తలమానికమైన చక్కెర కర్మాగారం మూసివేత, విజయా డైరీపై నిర్లక్ష్యధోరణి చిత్తూరు జిల్లా దైన్య స్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే రవాణా వ్యవస్థ, నీటి వనరులు, వాయు మార్గం ఉండి కూడా అభివృద్దిలో వెనుకబడిన చిత్తూరును అభివృద్ది చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలని నాగబాబు గారిని కోరారు. ముఖ్యంగా వందేళ్లకు పైగా జిల్లా కేంద్రంగా వ్యవహరింప బడుతున్న చిత్తూరు విద్యా వైద్యం, వృత్తి నైపుణ్య కేంద్రాలు, పేరు గల విద్యా సంస్థల స్థాపనకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పాదన సంగతి గాలికొదిలేసి ఉన్న పరిశ్రమలను మూసేస్తున్నారని అన్నారు. రహదారుల పరిస్థితి మరీ దారుణమని, నడకదారి నయమనే స్థితిలో రహదారులు ఉన్నట్లు తెలిపారు. రాయలసీమ మొత్తంలో పచ్చని పంటలు, పర్యాటకం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న చిత్తూరును నిర్లక్ష్యం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నాయకుల సమస్యలకు స్పందించిన నాగబాబు గారు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే విచ్ఛిన్నం అవుతున్న వ్యవస్థలు, మూత పడుతున్న పరిశ్రమలు, కుంగిపోతోన్న రహదారులు కాపాడుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని గెలిపించుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.