జేసీబీలతో ఇళ్లు కూల్చగలరు… అభిమానాన్ని కాదు

* అసత్య ప్రచారాలతో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించ లేరు
* సమకాలీన రాజకీయాల్లో జనసేన పార్టీ కార్యాలయం ఆధునిక దేవాలయం
* సమస్యలు పరిష్కారించాల్సిన ప్రభుత్వమే… సమస్యలను సృష్టిస్తోంది
* ఇప్పటం గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తామంటే… ఆ విరాళం ప్రభుత్వానికి కావాలంట
* పవన్ కళ్యాణ్ ఇస్తానన్నది గ్రామాభివృద్ధికి… జగన్ రెడ్డికి కాదు
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటం గ్రామస్థులకు చెక్కుల పంపిణీ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్

సమకాలీన రాజకీయాల్లో జనసేన పార్టీ కార్యాలయం ఆధునిక దేవాలయమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో భాగమైన ఈ కార్యాలయాన్ని దేవాలయంగా భావించే ఇప్పటం గ్రామస్తులను ఇక్కడకు ఆహ్వానించామని అన్నారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ దాష్టీకానికి ఇళ్లు కూల్చివేతకు గురైన ఇప్పటం గ్రామస్తులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అంతకు ముందు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తుంటే… అది చూసి ఓర్వలేక కొంతమంది ఆయనపై వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో జనసేన పార్టీ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనలో ఉన్న బలమైన పట్టుదలను తగ్గించడానికి ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా అది సాధ్యం కాని పని. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తుంటే… శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాటి పరిష్కారం కోసం ముందుకొస్తున్నారు.
* బెదిరించి… భయపెట్టినా ధైర్యంగా నిలబడ్డారు
జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం మూడు ప్రాంతాల్లో స్థలాలు చూశాం. సంబంధిత రైతులు కూడా స్థలం ఇస్తామని ముందుకొచ్చారు. అయితే రాత్రికి రాత్రి వారిని ప్రభుత్వ యంత్రాంగం బెదిరింపులకు గురి చేయడంతో ఉదయం కల్లా ఫోన్లు స్విచాఫ్ చేసి భూములు ఇవ్వలేమని చెప్పేశారు. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న మాకు మార్చి 6వ తేదీన ఇప్పటం రైతులు వచ్చి సభకు భూములు ఇస్తామని మాట ఇచ్చారు. వాళ్లను కూడా అదే రోజు రాత్రి స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు సభకు భూములు ఇవ్వకూడదని బెదిరించారు. అయినా కూడా వాళ్లంతా ధైర్యంగా ముందుకు వచ్చి జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారు. వారిలో మొట్టమొదటి సంతకం పెట్టింది శ్రీ సాంబిరెడ్డి గారు. తన రెండు ఎకరాల భూమిని సభ కోసం ఇస్తున్నట్లు సంతకం పెట్టారు. ఆ తరువాత మిగతా వారు అంతా కలిసి ఇంకో నాలుగు ఎకరాల భూమిని సభ కోసం ఇచ్చారు. ఇలా మొత్తం 6 ఎకరాల 4 సెంట్ల భూమి జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్థులు ఇచ్చారు.
* రూ. 50 లక్షలు ఇస్తామన్నది గ్రామాభివృద్ధికి… ప్రభుత్వానికి కాదు
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించిన ఇప్పటం గ్రామస్తులకు కృతజ్ఞతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ డబ్బుతో గ్రామంలో రోడ్లు వేద్దామా? కాలువలు కడదామా? ఆసుపత్రి నిర్మిద్దామా? లేదా వృద్ధాశ్రమం కడదామా? అనే చర్చ జరుగుతున్న సమయంలో కొంతమంది మూర్ఖులు తీర్మానం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తామన్న రూ. 50 లక్షలు సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాలని లెటర్ పంపించారు. ఆ మూర్ఖులకు నేను చెప్పేది ఒక్కటే… పవన్ కళ్యాణ్ గారు ఇస్తామన్నది ఇప్పటం గ్రామాభివృద్ది కోసమే… జగన్ మోహన్ రెడ్డి గారికి కాదురా నాయనా. తాము పొలాలు ఇవ్వొద్దు అన్నా జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇవ్వడంతో కక్ష కట్టిన ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో నోటీసులు ఇవ్వడం జరిగింది. బస్సులే తిరగని గ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరమా? ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత విషయం తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాత్రికి రాత్రే ఇక్కడికి బయలుదేరి వచ్చారు. ఇళ్లు కూలగొట్టలేదు… కేవలం ప్రహారి గోడలను మాత్రమే కూల్చామని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇల్లు అంటే కేవలం బెడ్ రూమేనా? ప్రహారి గోడ కాదా? మెట్లు ఇంట్లో భాగం కాదా? వైసీపీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోండి.. మీరు మాకు అండగా నిలబడిన వాళ్ల ఇళ్లు కూలగొట్టగలరేమోగానీ పవన్ కళ్యాణ్ గారితో వారికి ఉన్న అనుబంధాన్ని కూల్చలేరు. నాలుగు జేసీబీలతో గోడలను పడగొట్టగలరుగానీ అభిమానాన్ని పడగొట్టలేరు. ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు సాయం చేస్తామని ఎక్కడెక్కడ నుంచో జనసైనికులు, వీర మహిళలు ముందుకొస్తున్నారు… ఇది పవన్ కళ్యాణ్ గారు జనసైనికులందరికీ నేర్పిన సంస్కారం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, చిలకం మధుసూదన్ రెడ్డి, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు గాదె వెంకటేశ్వర రావు, కళ్యాణం శివ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాస్, షేక్ రియాజ్, మనుక్రాంత్ రెడ్డి, నేరెళ్ళ సురేష్, మార్కండేయ బాబు, అమ్మిశెట్టి వాసు, విజయ శేఖర్, కిరణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.