వైస్సార్ క్లీనిక్ ల పేరుతో కోట్ల రూపాయల దోపిడీకి స్థాయి సంఘం ప్లాన్

అవినీతికి చిరునామాగా స్థాయి సంఘం

*స్థాయి సంఘం నిర్ణయాలతో జీవీఎంసీకి కోట్ల రూపాయల నష్టం
*వైస్సార్ క్లీనిక్ ల అంచనాలు పెంచి కోట్ల దోపిడీకి సిద్దమవుతున్న సభ్యులు

కౌన్సిల్లో పెట్టాలని మేయర్, కమిషనర్లకు వినతి పత్రం అందించిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. వైస్సార్ క్లీనిక్ లలో అంచనాలు పెంచి కోట్లాది రూపాయలు దోచుకోవడానికి స్థాయి సంఘం సభ్యులు సిద్ధమవుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
వైస్సార్ క్లినిక్ నిర్మాణంలో రూ.16 కోట్ల కుంభకోణానికి అంచనాల పెంపకాలు పేరిట భారీ స్కాంకు స్థాయి సంఘం రంగం సిద్ధమైనదని, ఈ అంశాన్ని స్థాయీ సంఘం నుంచి తప్పించి కౌన్సిల్ లో చేర్చాలని కోరుతూ శుక్రవారం జీవీఎంసీ మేయర్, కమిసనర్లకు మూర్తి యాదవ్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా విశాఖ నగర పాలక సంస్థ స్థాయి సంఘం(స్టాండింగ్ కమిటీ) అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారిందన్నారు. గతంలో షాపులు, ఆస్తుల అద్దె బకాయిలు విషయంలో బయటపడిన స్థాయి సంఘం అక్రమాల కారణంగా సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. ఇప్పడు వైయస్ఆర్ క్లినిక్ లు (అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్) అంచనాలను టెండర్లు ఖరారై పనులు జరుగుతున్న సమయంలో 50% పెంచేస్తూ తీర్మానించే అంశాన్ని స్థాయి సంఘం ఎజెండాలో చేర్చిందన్నారు. ప్రభుత్వం ఒక్కో సెంటర్ కు రూ.80 లక్షలను గతంలో కేటాయించిందన్నారు. టెండర్ ఖరారై పనులు కూడా ప్రారంభమయ్యాయని, పనులు జరుగుతున్న సమయంలో స్థాయి సంఘంలోని కొందరు లంచాల కోసం ఈ సెంటర్ నిర్మాణ వ్యయాన్ని రూ.80 లక్షల నుంచి ఏకంగా కోటీ ఇరవై లక్షల రూపాయలకు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. శుక్రవారం నాటి సమావేశం ఎజెండాలో 14, 15, 16, 18, 19, 20వ అంశాలుగా వీటిని చేర్చారన్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 42 అర్బన్ క్లినిక్ ల అంచనాలను ఈ విధంగా పెంచుతూ పోతే సంస్థపై రూ.16 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. టెండర్ పిలిచి సమయానికి ఇప్పటికి నిర్మాణ వ్యయంలో, పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు లేనప్పుడు అర్థంతరంగా అంచనా వ్యయాన్ని పెంచడం అవినీతికి పాల్పడటమేనన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు, స్థాయీ సంఘం సభ్యుల కోసమే ఈ పెంపకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. నగర ప్రజల మీద చెత్త పన్ను, ఇంటి పన్ను భారం వేసిన విశాఖ నగర పాలక సంస్థ మరోపక్క 16 కోట్ల రూపాయలను అదనంగా, అప్పనంగా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం అనుమానాస్పదమేనన్నారు. నగర పాలక సంస్థపై కోట్లలో అదనపు భారం వేసి ఇంత కీలకమైన అంశాన్ని కౌన్సిల్ ఎజెండాలో చేర్చకుండా, కార్పొరేటర్ల చర్చించకుండా స్థాయి సంఘాల నిర్ణయం తీసుకోవటం నిబంధనలకు విరుద్ధమన్నారు. భారీ కుంభకోణానికి తెరలేపే ఈ అంశాన్ని స్థాయీ సంఘం అజెండాలో నుంచి తప్పించి నిజంగా అంచనాలను పెంచాల్సి వస్తే విస్తృత చర్చ కోసం కౌన్సిల్ ఎజెండాలో చేర్చొలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు అంచనాలు పెంచే ఏ టెండర్ వ్యవహారమైనా కౌన్సిల్ లోని చర్చించే విధంగా నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. స్థాయి సంఘం అవినీతి అక్రమాలకు చిరునామాగా మారకుండా పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తారని కోరుకుంటున్నామని చెప్పారు.