ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం

శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలని జనసేనాని కోరారు.