ఒమిక్రాన్‌పైనా.. అదే పోరు: డబ్ల్యుహెచ్‌ఓ సూచన

కరోనా డెల్టా వేరియంటపై పోరులో అనుసరించిన పద్ధతులే ఒమిక్రాన్‌పై పోరులోనూ ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. సరిహద్దులను మూసివేసే చర్యలూ ఇప్పుడూ చేపట్టాల్సిన అవసరముందని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ పశ్చిమ ఫసిఫిక్‌ అధికారులు ఈ విషయాన్ని శుక్రవారం నాడిక్కడ వెల్లడించారు. డబ్ల్యుహెచ్‌ఓ పశ్చిమ ఫసిఫిక్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ తకేషి కాసై మాట్లాడుతూ, ‘సరిహద్దులను మూసివేయడం వైరస్‌ నియంత్రణను ఆలస్యం చేస్తుంది. మనకు సమయాన్ని ఇస్తుందని అన్నారు. ‘ఒమిక్రాన్‌ను ఎదుర్కోడానికి మన మార్గాలను మార్చుకోనవసరం లేదు’ అని చెప్పారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలనే దీనికి అవలంభించవచ్చన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒమిక్రాన్‌ను ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించారని, ఇది ఇతర వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు సంస్థ ప్రాంతీయ అత్యవసర డైరెక్టర్‌ డాక్టర్‌ బాబా తుండే ఒలోవోకురే తెలిపారు.

  శ్రీలంకలోనూ ఒమిక్రాన్‌

ఒమిక్రాన్‌ వేరియంట్‌ శ్రీలంకకు వ్యాపించింది. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసును గుర్తించినట్లు శ్రీలంక అధికారులు శనివారం వెల్లడించారు. ఇటీవలే విదేశీ ప్రయాణం చేసిన వ్యక్తిలో ఈ కేసును గుర్తించినట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ నేపధ్యంలో శ్రీలంక అధికారులు ఇప్పటికే దక్షిణాఫ్రికాతో సహ ఆరుదేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది. అయినా ఇప్పటికే దేశంలోని ఒమిక్రాన్‌ ప్రవేశించి ఉండవచ్చనని అధికారులు తెలిపారు.
 

 దేశంలో కొవిడ్‌ క్లస్టర్లు : కేంద్రం ఆరోగ్య శాఖ హెచ్చరిక

దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్ల సమూహాలు (క్లస్టర్లు) ఏర్పడినట్లు వార్తలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెచ్చరించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి రక్షణ పొందడానికి మరిన్ని ప్రజారోగ్య చర్యలు అవసరమని తెలిపింది. టీకాలతో యాంటీబాడీలు, సెల్యూలార్‌ ఇమ్యూనిటీ వంటి రక్షణ లభిస్తుందని తెలిపింది. టీకాలతో వ్యాధి తీవ్రత తగ్గుతుందని ఇప్పటికే రుజువుకావడంతో టీకాలు వేయడం చాలా ముఖ్యమని పేర్కొంది.
     అలాగే, పాజటివ్‌ వ్యక్తుల కాంట్రాక్టుల ట్రేసింగ్‌లపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ‘వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ట్రేసింగ్‌లపై దృష్టి పెట్టడం చాలా కీలకంగా ఉంటుంది. పాజటివ్‌ వ్యక్తుల కాంట్రాక్టులును 72 గంటలలోపు తప్పనిసరిగా గుర్తించాలి. వారిని నిర్భంధించాలి. పరీక్షించాలి. అలాగే పాజటివ్‌ వ్యక్తుల నమూనాలను వేగంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపాలి. ఐఎన్‌ఎస్‌ఎసిఒజి నెట్‌వర్క్‌లోని ప్రయోగశాలలకు మాత్రమే పంపాలి. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి’ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. కరోనా క్లస్టర్లు లేదా హాట్‌స్పాట్లను గుర్తించడంలో క్రియాశీల నిఘా, పరీక్షలు చాలా కీలకమని రాజేష్‌ భూషణ్‌ తెలిపారు.