ఒక్క రోడ్డు వెయ్యి మహా ప్రభో అంటే వేయలేడు

•మూడు రాజధానులు కడతానంటాడు
•ప్రభుత్వమే సమస్యలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెడుతోంది
•ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు సొంత భవిష్యత్తు చూసుకుంటున్నారు
•జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాడుతుంది
•పార్వతీపురం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తూ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాజధాని రావడం వల్ల జీవితాలు మారుతాయని ప్రచారం చేస్తున్నా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ పాలకుడుని నమ్మడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి గారిని ఒక్క రోడ్డు వెయ్యి మహా ప్రభో అంటే మూడు రాజధానులు కడతామంటున్నాడని ఎద్దేవా చేశారు. ఒక పార్టీ, నాయకుడు లక్ష్యంగా దాడి చేసే విధంగా పూర్తి సమయం కేటాయించుకున్నారని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో భాగంగా బుధవారం సాయంత్రం పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో స్థితిగతులపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు వారి భవిష్యత్తుని మాత్రమే చూసుకుంటున్నారు. వారి ఆస్తులు పెంచుకుంటున్నారు. కొండలు మొత్తం తవ్వేస్తున్నారు. ప్రజల ఆస్తులు దోచేస్తున్నారు. ఎక్కడ చూసినా మాఫియా చేరిపోయింది. పార్వతీపురం నియోజకవర్గంలో బోద కాలు సమస్య గురించి దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. ఇది నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయినప్పటికీ ప్రభుత్వాలు నివారణకు చర్యలు తీసుకోలేకపోయాయి. అటు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు.. నేను ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ ఆగిపోతాయని వాగ్దానాలు చేశారు. ఈ మహానుభావుడు సీఎం అయ్యాక రైతుల ఆత్మహత్యల లెక్కలే బయటకు రాకుండా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల దైన్యస్థితి చూసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి భరోసా కల్పించేందుకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించి ఆ కార్యక్రమానికి స్వయంగా రూ. 5 కోట్లు సమకూర్చారు. ఆ కార్యక్రమం కోసం ప్రజల్లోకి వెళ్తుంటే చూసి తట్టుకోలేక రకరకాల ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జనసేన పార్టీ గురించి ప్రజల్లో వ్యతిరేక ఆలోచనలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
•జనసేనపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ప్రతి జనసైనికుడు ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలి. ఆ ప్రయత్నాన్ని బలంగా ఖండించాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీల దగ్గరకు వెళ్లి బాధితుల తరఫున బలంగా, ధైర్యంగా మాట్లాడినట్టే ఇతర పార్టీల నాయకులు మాట్లాడినప్పుడు బలంగా ఖండించండి. ప్రజల్లో మన బలం మనకి ఉంది. ప్రజల పక్షాన నిలబడిన రోజున మనం ఖచ్చితంగా బలపడతాం.
•జనసేనకు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం
మనం కేవలం సమస్యల మీద మాత్రమే పోరాటం చేద్దాం. బోద కాలు సమస్య మీద, తాగునీటి సమస్య మీద పోరాటం చేద్దాం. మనం వ్యక్తిగతంగా ఎవరి మీదా దాడి చేయవద్దు. మన వల్ల రాష్ట్రానికి మంచి జరగాలి. పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తే మన బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారంతా కూడా అదే విధమైన ఆవేదన వ్యక్తపరిచారు. మా ప్రాంతంలో ఇన్ని వనరులు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగాల కోసం మేము ఎందుకు వలసలు పోవాలి. మా గ్రామాల్లో పచ్చటి ప్రకృతి, అద్భుతమైన వాతావరణంలో ఎందుకు పని దొరకదు. అభివృద్ధి కొన్ని కుటుంబాలకే ఎందుకు పరిమితం అయ్యింది అన్నది వారి ఆవేదన. సామాన్యుడి పక్షాన గళం వినిపించడం కోసమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. మీరు పట్టుదలతో ముందుకు వెళ్తే ఒక సమస్యను ముందుకు తీసుకువెళ్లగలుగుతారు. మనం ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యక్రమాల్లో శ్రీపవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుని మీరు కూడా సిద్ధం కండి. గ్రామ స్థాయి నుంచి సమావేశాలు మొదలుపెట్టండి. ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు పని చేస్తున్నారు అనే విషయాన్ని పార్టీ గమనిస్తూనే ఉంటుంది. పార్టీ నిర్ధేశిత కార్యక్రమాలు చేపట్టినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు సమీక్షిస్తారు. ఇంఛార్జులు లేకున్నా జనసైనికులు నిలబడి కార్యక్రమాలు చేసినప్పుడు వారికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో అదే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్లే ప్రజల్లో జనసేన పట్ల విశ్వాసం వచ్చింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన వేదిక వల్లే మనకు ఈ అవకాశం వచ్చింది. ఇతర పార్టీలకు భిన్నంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం కాబట్టి.. అందుకు తగ్గట్టు ముందుకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో కష్టాలు, అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ మనమంతా ధైర్యంగా ముందుకు సాగుతున్నాం అంటే ఆ ధైర్యం కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందే. మనం ముందుగా పార్టీకి అంకితభావంతో పని చేస్తేనే ప్రజలు మనల్ని నమ్ముతారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ, జనసేన నాయకత్వం గురించి జీతాలు ఇచ్చి మరీ క్షేత్ర స్థాయిలో దుష్ప్రచారం చేయించారు. ఇలాంటి ప్రచారాలను తిప్పికొడుతూ మనం రాజకీయ వ్యవస్థగా బలపడాలి. రాబోయే రోజుల్లో పార్వతీపురం నియోజకవర్గంలో మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తాం. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పని చేయాల”న్నారు.