సరస్వతీ దేవిని అర్చించిన పవన్ కళ్యాణ్

* అక్టోబర్ మాసంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలపై ముఖ్య నిర్ణయాలు

హైదరాబాద్, శరన్నవరాత్రి పర్వదినాల్లో భాగంగా పంచమి తిధిని పురస్కరించుకొని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సరస్వతి పూజ నిర్వహించారు. శుక్రవారం ప్రభాత సమయాన శాస్త్రోక్తంగా పూజాదికాలు చేపట్టారు. తెల్లవారుజామునే హైదరాబాద్ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాలకు సకల శుభాలు కలుగచేయాలని ప్రార్థించారు. పూజానంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ నిర్వాహకులతో సమావేశమై అక్టోబర్ మాసంలో పార్టీపరంగా నిర్వహించ తలపెట్టిన సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశాలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వలంటీర్లు, వీరమహిళలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా – శతఘ్ని క్రియాశీలక సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. జిల్లాల వారీగా సమీక్షలు చేపట్టబోతున్నారు. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్ లతో మొదలవుతాయి. నా సేన కోసం నా వంతు కార్యక్రమంపై సమీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి సన్నాహకాలపై ముఖ్య నేతలతో సమాలోచన జరుపుతారు. గతంలో సంకల్పించిన అనుష్టుప్ నారసింహ యాత్ర చేపట్టడంపై ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చర్చించారు. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, ఎ.వి.రత్నం, పి.హరిప్రసాద్, షేక్ రియాజ్, యాతం నగేష్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.