పవన్ కళ్యాణ్ ఆశయ సాధకులు జన సైనికులే

* ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయి దృష్టి
* ప్రజా సమస్యల మీద పోరాటమే ఆయుధంగా ముందుకు వెళ్దాం
* ఐక్యమత్యంగా పార్టీ కోసం కష్టపడదాం
* ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం మన బాధ్యత
* విజయనగరం నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమీక్ష సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పని చేసే జనసైనికులే జనసేన పార్టీకి బలం.. వారే మన బలగం. అంతా సమష్టిగా ముందుకు వెళ్లి ప్రజా పోరాటాలతో ప్రజల మద్దతు గెలుచుకుందాం. ఈ పోరాటంలో కిందిస్థాయి కార్యకర్త నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వరకు అందరికీ అన్ని స్థాయిల్లో మద్దతు ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గాల సమీక్షలో భాగంగా మొదటిగా మంగళవారం సాయంత్రం విజయనగరం నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జనసేన పార్టీ నూతన పంథాలో, జనసేన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లు, వీర మహిళలకు ప్రాధాన్యమిచ్చేలా నిర్వహించింది. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సభ్యులను, వాలంటీర్లను, వీర మహిళలను లాటరీ పద్ధతిలో వేదికపైకి పిలిచి వారి చేతనే శ్రీ మనోహర్ గారు మాట్లాడించారు. నియోజకవర్గంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమావేశం ప్రారంభం సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “ఒక్కో మెట్టు ఎక్కుతూ బలమైన ఆశయ సాధన ఉన్న వ్యక్తుల సమూహంతో జనసేన పార్టీని నిర్మిస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల దారిలో బలంగా పోరాడే యువతను ఇప్పటికే ఒకే దగ్గరకు తీసుకువచ్చాం. పార్టీ కోసం సీరియస్ గా కష్టపడండి. కచ్చితంగా మీకు పార్టీ గుర్తింపు ఇస్తుంది. మీ గుర్తింపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. విజయనగరం జిల్లాలో జూట్ మిల్ సమస్యతో పాటు మైనింగ్, షుగర్ మిల్స్, సహకార సంస్థల మూసివేత వంటి ప్రధానమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే సమస్యల మీద నిత్యం పోరాడండి. పార్టీ కోసం కచ్చితమైన సమయాన్ని కేటాయించి ప్రజా సమస్యలను భుజానికి ఎత్తుకొని ముందుకు వెళ్ళండి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి అంటే కచ్చితంగా ప్రజల మద్దతు అవసరం. వారి సమస్యల మీద నిత్యం జనసేన పార్టీ గళం ఎత్తితే ప్రజల మద్దతును కూడగట్టుకోవడం పెద్ద విషయం కాదు. మనమంతా ఐక్యంగా పోరాడితే కచ్చితంగా విజయం సాధ్యం. అధికార పార్టీ తీసుకునే ఏ చర్యనైనా సమష్టిగా ఎదుర్కొందాం. మన ఐక్యతను చూసి పాలకులు బెదిరిపోయేలా పని చేద్దాం. చిన్న చిన్న సమస్యలు, వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లొద్దు. మన లక్ష్యం ఒక్కటే కావాలి… అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం కావాలి.
 * ఉత్తరాంధ్రపై ప్రధాన దృష్టి
ఉత్తరాంధ్ర పై జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక దృష్టి ఉంది. ఈ మూడు జిల్లాల్లో పార్టీకి బలమైన అభిమాన గణం ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం పెట్టే ప్రేమ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు. కచ్చితంగా ఈసారి జనసేన పార్టీని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి. దీనికి నాయకుల చిత్తశుద్ధి, నిబద్ధత ఎంతో అవసరం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను ముందు గుర్తిద్దాం. వాటిని ఎలా పరిష్కారం చేయాలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం. కుటుంబ పాలనలో ఉన్న ఉత్తరాంధ్రను ప్రజా పాలనలోకి తీసుకొని వద్దాం. దీనికోసం ప్రతి జన సైనికుడు తన పరిధిలో బలంగా కష్టపడాల్సిన అవసరం ఉంది. కావాలని రెచ్చగొట్టి, జనసైనికులను ఉద్రేకపరిచే చర్యలు అధికార పార్టీ నాయకులు చేస్తారు. అలాంటి వాటికి ఊరికి ఆవేశపడకుండా ఆలోచనతో ప్రజాస్వామ్య పంథాలో ముందుకు వెళ్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి సుదీర్ఘ ప్రయాణంలో జనసేన పార్టీ కార్యకర్తలే ఆయన వెంట నిలబడ్డారు. ఏ నాయకుడు అయినా కార్యకర్తలను అవమానపరిచేలా అవహేళన చేసేలా ప్రవర్తిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షమించరు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు వెళితే బాగుంటుంది ఎలా పోరాడితే మరింత ప్రజలకు చేరువవుతాం అన్న విషయాలను కచ్చితంగా గుర్తించండి. పార్టీ ఉన్నతి కోసం మీ విలువైన సమయాన్ని ఆలోచనలను పంచుకోండి.
* కావాలనే దుష్ప్రచారం
జనసేన పార్టీకి రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీకి వణుకు మొదలైంది. ఎలాగైనా జనసేన పార్టీని అణిచివేయాలనే కుట్రలో భాగంగా మరోపక్షంతో మనల్ని జత చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని ఐక్యమత్యంగా జనసైనికులు తిప్పికొట్టాలి. సంక్షేమం సంక్షేమం అంటూ అన్ని రంగాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేయాలి” అని అన్నారు. అనంతరం విజయనగరం నియోజకవర్గ పరిస్థితులపై వేదికపై ఉన్న వీర మహిళలు, వాలంటీర్లు, స్థానిక నేతలతో మాట్లాడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలను తెలుసుకున్నారు. వాటన్నిటిని కార్యకర్తలతో కలసి కూర్చొని మనోహర్ నోట్ చేసుకున్నారు. కచ్చితంగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ చెప్పారు. ఈ సమీక్షలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వితోపాటు శ్రీమతి బి.రేణుక, శ్రీమతి మాతా గాయత్రి, చంద్రు నాయుడు, అనిల్, పిడుగు సతీష్, రౌతు సతీష్ కుమార్, డా.మురళీ మోహన్, హుస్సేన్ ఖాన్, ఆదాడ మోహన్, వై.చక్రవర్తి, యోగేష్ తదితరులు మాట్లాడారు.