ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు భయపడకూడదు

•ఏళ్లు గడచినా క్షేత్ర స్థాయిలో రోగులకు వసతులు లేవు
•సీటీ స్కాన్ యంత్రం ఏడాది క్రితం చెడిపోతే పట్టించుకోరా?
•రక్త నిల్వలు తగ్గితే ఇవ్వడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు
•వసతుల కల్పనలో పాలకులు బాధ్యతగా వ్యవహరించాలి
•తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
•అన్ని విభాగాల పరిశీలన.. రోగులతో మాటా-మంతి..

ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు భయపడుతూ వచ్చే పరిస్థితులు ఉండకూడదని, పేదవారికే పరిమితం కాకూడదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వారి మీద ఉంటుందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరిదిద్దుకోవాల్సిన అంశాలపై పాలకులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. శనివారం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఓపీ సేవలు, అత్యవసర విభాగం, సీటీ స్కాన్, తల్లిపిల్లల వార్డులను సందర్శించారు. ప్రతి రోగినీ పలకరించి ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఏడాది క్రితం సీటీ స్కాన్ యంత్రం చెడిపోయిన విషయాన్ని సిబ్బంది ద్వారా శ్రీ మనోహర్ గారు తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వలు తక్కువగా ఉన్న అంశాన్ని గుర్తించారు. గర్భిణులకు, బాలింతలకు అందించే పౌష్టికాహారం వివరాలు పరిశీలించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సర్ధుబాటు చేయాల్సిన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుదూర ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తూనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం. క్షేత్ర స్థాయిలో వసతులు ఏర్పాటు చేస్తే ఇంత దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సాధారణ కాన్పులకు కూడా ఆయా ప్రాంతాల్లో సౌకర్యాల మీద నమ్మకం లేక ఇంత దూరం వస్తున్నారు. ఇక్కడ వైద్యుల మీద ఒత్తిడి ఎక్కువగానే ఉంది. తెనాలి ఆసుపత్రికి ఒక గైనకాలజిస్ట్ అవసరం కూడా ఉంది. పారదర్శకంగా రోగులకు భరోసా నింపే విధంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
•అవసరం అయితే జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఆసుపత్రిలో మరింత రక్త నిల్వల అవసరం ఉంది. తెనాలి ప్రాంతంలో ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు అధికంగా ఉంటాయి. అప్పటికప్పుడు రక్తం అవసరం అయితే ఇబ్బంది అవుతుంది. గతంలో ఏ ఆసుపత్రికి అవసరం అయినా తెనాలి ఆసుపత్రి నుంచి ఇవ్వగలిగే పరిస్థితి ఉండేది. ఎప్పుడు రక్తం అవసరం ఉన్నా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని వైద్యులకు తెలియచేశాం. ఆసుపత్రిలో రక్తం 

కొరత ఉండకూడదు. సీటీ స్కాన్ యంత్రం పాడై ఏడాది గడచింది. ఇప్పటి వరకు కనీసం కొత్త యంత్రం ఏర్పాటుకు టెండర్లు కూడా పిలిచిన దాఖలాలు లేవు. రూ.500 అయినా పేదల మీద భారం పడుతుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తక్షణం సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయించాలి. రాబోయే రోజుల్లో నా వంతు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా.. సమస్యలు ప్రభుత్వంలో ఉన్న వారి దృష్టికి తీసుకువెళ్తా. కోవిడ్ సమయంలో అద్భుతంగా పనిచేసి పేదలకు సేవలు అందించిన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా” అన్నారు. అనంతరం.. కొలకలూరు గ్రామానికి వెళ్లారు. ఇటీవల మృతి చెందిన కొలకలూరు మాజీ సర్పంచ్ కాళిశెట్టి సోమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, స్థానిక పార్టీ నేతలు పసుపులేటి మురళీ, తొటకూర వెంకట రమణారావు, జాకిర్ హుస్సేన్, ఎర్రు వెంకయ్య నాయుడు, దివ్వెల మధుబాబు, గుంటూరు కృష్ణమోహన్, కొల్లిపర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.