అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే

• ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది
• ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారు
• ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి
• ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు
• సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు

* జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో చివరికి గెలిచేది ఆత్మ గౌరవమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చారన్నారు. ప్రజా సమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం ఇస్తే… జగన్ రెడ్డి ఇటువంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండరన్నారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద జరిగిన సంఘటనలు చూసి యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయిందని తెలిపారు. శనివారం బీమ్లానాయక్ చిత్ర విడుదల సందర్భంగా జరిగిన హడావిడి తదనంతర పరిణామాలపై వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. మనం ఎవ్వరూ ఊహించని విధంగా క్షేత్రస్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పెట్టుబడులుపెడితే ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి… నిన్న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా ప్రతి సినిమా థియేటర్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా కుట్ర చేయడం సిగ్గుచేటు.
రెవెన్యూ సిబ్బంది రైతులకు ఉపయోగపడే విధంగా పని చేయాల్సి ఉంది. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు జారీ చేయాలి. విద్యార్ధులకు, సామాన్యులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వాలి. వీళ్లకున్న బాధ్యతలను పక్కనపెట్టించి వేకువ జామునే వీళ్లందనీ సినిమా థియేటర్ల దగ్గరకు పంపించి ప్రత్యేకంగా సినిమాకు వచ్చే ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వం చేసిన కుట్ర చాలా చాలా పొరపాటు. రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికార బాధ్యతలను పక్కనపెట్టించారు.

•కలిసి నడుద్దాం రండి 

భీమ్లా నాయక్ చిత్రంలో ఆత్మగౌరవానికి, అహంభావానికి జరిగే పోరాటం ఉంది. అంతిమంగా గెలిచి నిలిచేది ఆత్మగౌరవమే. సంకుచిత మనస్తత్వం, కక్షపూరితంగా నియంతలా వ్యవహరిస్తూ.. నా ఆలోచన మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది. వైసీపీలో ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్జ్ఞప్తి చేస్తున్నాను. సమయం వచ్చింది.. ఆత్మగౌరవంతో ఉన్న మీరు పార్టీ నుంచి బయటకు రండి. మాతోపాటు నడిచి ప్రయాణం చేయండి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వెళ్తూ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం.

•హుందాగా నడుచుకున్నారు … అభినందనలు

భీమ్లా నాయక్ విడుదల సమయంలో ఎన్నో ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు. అధికార పార్టీ వాళ్ళు ఎంతగా ఇబ్బందిపెట్టినా వైసీపీ నాయకుల్లా ఎక్కడ కూడా ఏ పోలీస్ అధికారి కాలర్ పట్టుకోలేదు. కానిస్టేబుళ్లపై దురుసుగా ప్రవర్తించలేదు. చాలా హుందాగా ప్రవర్తించి విజయవంతం చేశారు. సహనం, ఓపికతో వ్యవహరించిన జన సైనికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున, పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను.