కొత్త వైద్య కళాశాలల నత్తనడక

*నిధుల్లేక ముందుకు సాగని భవనాల నిర్మాణం
*కొన్ని చోట్ల శంకుస్థాపనతోనే సరి
*ఎప్పటికి పూర్తవుతాయో ఎవరూ చెప్పలేని స్థితి
*కేంద్ర సాయం అర్ధిస్తున్న రాష్ట్ర సర్కారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కొత్త వైద్య కళాశాలల కోసం బీజేపీ సర్కారు ఆర్థిక సహాయం అడగడం ఆనవాయితీగా మారిపోయింది. కేంద్రం నుంచి వచ్చే సొమ్మును ఈ కాలేజీలకు ఎంత ఖర్చుచేస్తున్నారోగాని జిల్లాకో వైద్య కళాశాల ఉండాలనే లక్ష్యం కనుచూపు మేర కనిపించడం లేదు. రాష్ట్రంలో కొత్తగా 14 బోధనా వైద్య కళాశాలల నిర్మాణానికి 15 నెలల క్రితం అంటే 2021 మే 31న ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి నుంచి ‘వర్చువల్‌’గా శంకుస్థాపన చేశారు. ఇంకేముంది రాష్ట్రంలో మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 27కు పెరగబోతోందని జనమంతా సంతోషించారు. ఈ సామూహిక శంకుస్థాపన కార్యక్రమం ముగిసేనాటికి రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల పరిస్థితి ఏమిటో ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. ఏడాది మూడు నెలల క్రితం ఏపీలో 11 వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయి. ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పాడేరు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందులలో వైద్య కళాశాలల భవనాల నిర్మాణం అప్పటికే జరుగుతోంది. 14 కాలేజీల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ‘‘ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే 16 కొత్త బోధనా వైద్య కళాశాలల్లో 14 కాలేజీలకు శంకుస్థాపన చేశాం. పాడేరు, పులివెందులలో భవనాల నిర్మాణం ఇది వరకే మొదలైంది. ఈ కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసే అన్ని చోట్లా నర్సింగ్‌ కాలేజీలు కూడా నిర్మిస్తాం,’’ అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెంచడానికి ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టామని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా ఒక ప్రకటన చేసింది. అంతా బాగానే ఉంది. ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టడం రాష్ట్ర చరిత్రలో కొత్త రికార్డు. కాని ఈ నిర్మాణమే అత్యంత నెమ్మదిగా సాగడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.
*అన్ని వసతులతో అంటూ ఊరింపు
ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మొదలు బెడితే–పాడేరు, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం ఏడాది కన్నా ముందే ప్రారంభించారు. ఈ వైద్య కళాశాలలు, ఆదివాసీ ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించడానికి జగన్‌ సర్కారు మొత్తం 885 ఎకరాల భూమిని సేకరించింది. ఈ కాలేజీల్లో విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం కళాశాలలకు 150 చొప్పున సీట్లు కేటాయించారు. మిగిలిన వైద్య కళాశాలలకు వంద చొప్పున సీట్లు కేటాయించారు. ఈ అన్ని కొత్త వైద్య కళాశాలల్లో ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, డయాగ్నస్టిక్స్, ఐసీయూలు, పది అత్యంత ఆధునిక ఆపరేషన్‌ థియేటర్స్‌ ఉంటాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా బాగానే ఉందిగాని అసలు నిర్మాణమే నత్తనడక నడవడం అర్ధంకాని విషయంగా మారింది. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని సీఎం జగన్‌ ఓపక్క చెబుతుండగా–ప్రజల వైద్య పరిరక్షణకు పునాది వంటి వైద్యకళాశాలల ఏర్పాటులో విపరీత జాప్యం జరగడం జగన్‌ సర్కారు ఉదాసీన వైఖరికి అద్దంపడుతోంది. ఆదివాసీ ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కూడా శరవేగంతో పూర్తిచేస్తామని ఏడాది క్రితం ప్రకటించినా ఆశించిన మేరకు పురోగతి లేదు.
*మార్కాపురంలో నేల చదునూ పూర్తి కాలేదు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజని ఆగస్టు 25న ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్‌ మండావియాను కలుసుకుని, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అర్ధించారు. సీఎం జగన్‌ కూడా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నప్పుడు వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు సమకూర్చాలని కోరారు. ఈ కళాశాలల నిర్మాణాల పనుల తాజా పరిస్థితిని గమనిస్తే అసలు కాలేజీలు రాబోయే ఎన్నికల నాటికి (2024 మే) అయినా ప్రారంభమౌతాయా? అనే అనుమానం వస్తోంది. 2019 మే నెలాఖరులో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు గురించి జగన్‌ సర్కారు ప్రకటన చేసింది. 16 కొత్త మెడికల్‌ కాలేజీలను మూడేళ్లలో పూర్తిచేసి ప్రారంభిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థికస్థితిగతులు అంచనా వేయకుండానే బ్యాంకులు ఈ నిర్మాణాలకు రుణాలు ఇస్తాయనే ధీమాతో కొత్త కాలేజీలు కట్టడానికి టెండర్లు పిలిచారు. భవనాల నిర్మాణానికి డిజైన్ల రూపకల్పన, ఇతర పనులు వేగంగా పూర్తిచేశారు. కాలేజీల భవనాల నిర్మాణం ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. పని మొదలుపెట్టారు. కాని బ్యాంకుల నుంచి రుణాలు అందలేదు. దాంతో శంకుస్థాపనలతోనే అనేక చోట్ల నిర్మాణం పనులు ఆగిపోయాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాలే దీనికి చక్కటి ఉదాహరణ. మార్కాపురం మండలం రాయవరంలో 50 ఎకరాల భూమిని మెడికల్‌ కాలేజీకి కేటాయించి, నిర్మాణ వ్యయం రూ. 475 కోట్లని అంచనా వేశారు. కాని, నిర్మాణ పనులకు ప్రభుత్వం నుంచి అసలు నిధులే రాకపోవడంతో ఇక్కడ నేల చదును కార్యక్రమం కూడా జరగకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ స్థలంలో గుంటలు, వర్షం నీళ్లే దర్శనమిస్తున్నాయి.
* ఆరు చోట్లే చెప్పుకోదగ్గ స్థాయిలో సాగుతున్న పనులు
బ్యాంకులు, ఇతర మార్గాల నుంచి నిధులు తగినన్ని సమకూరకపోవడంతో ముందు అనుకున్న 16 కాలేజీలకు బదులు కేవలం ఆరు వైద్య కళాశాలల భవనాల నిర్మాణమే ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి అసెంబ్లీ స్థానమైన ఒక్క పులివెందులలో మాత్రమే పనులు కాస్త వేగంగా సాగుతున్నాయి. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలపై మాత్రమే ప్రభుత్వం దృష్టిపెట్టి నిర్మాణాలు పూర్తికావడానికి దోహదం చేస్తోంది. పులివెందులలో 52 ఎకరాల్లో రూ.500 కోట్ల అంచనా నిర్మాణ వ్యయంతో 2021 జూన్‌ మాసంలో కాలేజీ భవనాల నిర్మాణం ప్రారంభించారు. 2023 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పనులు పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుంది. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మెడికల్‌ కాలేజీకి రూ.475 కోట్ల అంచనా వ్యయం, 62.68 ఎకరాల భూమితో కిందటేడాది నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నేల చదును చేసే పనులు కూడా నిధుల కొరతతో ఆగిపోయి ఉన్నాయి. ఉత్తరాంధ్రలో భాగమైన అనకాపల్లి వైద్య కళాశాలకు ఇంకా భూమి కేటాయింపు కూడా జరగలేదు. స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి సంబంధించిన భూమిని ఈ కాలేజీకి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. స్థానికులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో ఆ పని ఆగిపోయింది. ఫలితంగా నర్సీపట్నం సమీపంలోని భూములను ఈ కాలేజీకి కేటాయించడానికి అధికారులు పరిశీలిస్తున్నారు.
*శంకుస్థాపనతోనే ఆగిన బాపట్ల భవనాలు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరులో నిర్మించాలని భావించిన వైద్య కళాశాల నిర్మాణానికి రూ.472 కోట్లు కేటాయించామని ప్రకటించారు. సేకరించిన భూమిలో ఎలాంటి పనులు చేపట్టలేదు. ఇప్పటికీ ఈ నేల పచ్చిక బీడుగానే కనిపిస్తోంది. రూ.505 కోట్ల అంచనా వ్యయంతో కిందటేడాది శంకుస్థాపన చేసిన బాపట్ల మెడికల్‌ కాలేజీ నిర్మాణం అంతటితోనే ఆగి ఉంది. గోడలు ఎక్కడా పైకి లేవనే లేదు. విజయనగరం వైద్య కళాశాలకు ఇటీవల నాబార్డ్‌ రూ.500 కోట్లు ఇవ్వడానికి ముందుకు రావడంతో నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మొదట మంజూరైన రూ.240 కోట్లు నిధుల రూపంలో విడుదల కాకపోవడం ఈ కాలేజీకి శాపమైంది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం మొదలుపెట్టిన వైద్య కళాశాల భవనాలు వచ్చే ఏడాదికైనా పూర్తయ్యేలా లేవు. ఈ లెక్కన వచ్చే ఏడాది నుంచి ఇక్కడ బోధనా తరగతులు నిర్వహించడం కుదిరేపని కాదు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ కాలేజీకి రూ.475 కోట్లతో భవనాల నిర్మాణం పూర్తిచేయాలని అంచనావేశారు. కేటాయించిన భూమి చదును పని కూడా పూర్తికాలేదు. నంద్యాల మెడికల్‌ కాలేజీ నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది. 51 ఎకరాల్లో రూ.475 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ కాలేజీకి భూముల కేటాయింపు వివాదం ఇటీవల పరిష్కారమైంది. దీంతో పనులు జులై 22న ప్రారంభించారు.
*రాజమహేంద్రవరంలో వచ్చే ఏడాది క్లాసులు అనుమానమే
వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్‌ క్లాసులు ప్రారంభమౌతాయని ప్రభుత్వం ప్రకటించిన రాజమహేంద్రవరం కాలేజీలో ఒకట్రెండు భవనాల నిర్మాణమే వేగం పుంజుకుంది. ఇతర విభాగాల భవనాల నిర్మాణం పని ఇంకా పూర్తి కాలేదు. కర్నూలు జిల్లా ఆదోని మెడికల్‌ కాలేజీ నిర్మాణం అసలు మొదలు కాలేదు. ఆదోని–ఎమ్మిగనూరు రహదారిలో 58.44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన కాలేజీ పూర్తి కావడానికి అంచనా వ్యయం రూ.475 కోట్లు. కేవలం కాలేజీ విస్తీర్ణం, అంచనా వ్యయం వంటి వివరాలు తెలిపే రెండు బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరంలో నిర్మిచతలపెట్టిన వైద్య కళాశాలకు సంబంధించి నేల చదును చేసే పనులు మాత్రమే సాగుతుండగా, నిధులు లేక ఇతర నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయి. కాలేజీ పూర్తి కావడానికి ఇంకా మూడు సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు.
*పల్నాడు కాలేజీ పిల్లర్లు లేచాయి
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాల భవనాలు కూడా పునాది స్థాయిలోనే ఉన్నాయి. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాలేజీలో ఆస్పత్రి, కొన్ని బ్లాకుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో 2000 అక్టోబర్‌ 2న శంకుస్థాపన జరిగిన వైద్య కళాశాల నిర్మాణం కూడా కుంటి నడక నడుస్తోంది. రూ.350 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ వైద్య కళాశాల భవనాల నిర్మాణం మిగిలిన కాలేజీలతో పోల్చితే కాస్త మెరుగు. పది నుంచి 15 శాతం పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. ఇక ఏలూరు మెడికల్‌ కాలేజీలో కూడా నిర్మాణం పనులు మెల్లగా సాగుతున్నాయి. పనులు మొదలై రెండేళ్లు దాటుతున్నా నిర్మాణం ఓ మోస్తరుగా కూడా సాగడం లేదు. ఇకపోతే, ఈ 16 కాలేజీల్లోనూ నిర్మాణం త్వరగా పూర్తవుతుందనుకుంటున్న ఐదు కాలేజీల్లో (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) 2023–2024 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు మొదలుపెట్టడానికి అనుమతి ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు ఏపీ సర్కారు లేఖ కూడా రాసింది. బోధనా సౌకర్యాలు సరిగాలేని ఈ కళాశాలల్లో కేంద్ర బృందాల తనిఖీ తర్వాత అడ్మిషన్లకు అనుమతి లభించేదీ లేనిదీ తేల్చిచెప్పడం కష్టం. సకాలంలో సొమ్ము చేతికి రాక కాంట్రాక్టర్లు నిర్మాణం జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవి ఎప్పటికి పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయో చెప్పలేని పరిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *