ఆగిన హెల్త్ అలవెన్స్ లు వెంటనే విడుదల చేయాలి

  • అదనపు కమీషనర్ కు వినతిపత్రం అందచేసిన జనసేన నేతలు, కార్మిక సంఘ నాయకులు

గుంటూరు: పారిశుద్ధ్య కార్మికులకు, ఒప్పంద ఉద్యోగులకు నాలుగు నెలలుగా ఆగిన హెల్త్ అలవెన్స్ లను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం కార్మిక సంఘ నేత సోమి ఉదయ్ తో కలసి నగరపాలక సంస్థ ఏ.సీ పెద్ది రోజాకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు తమ విధులు మొత్తం చెత్తా చెదారాల, మల మూత్రాల మద్యే గడుపుతారన్నారు. కొన్ని సార్లు విష వాయువుల మధ్య ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంటారన్నారు. వీరికి వ్యాధులు ఎప్పుడూ చుట్టిముట్టే ఉంటాయని అలాంటి వారికి ఆరోగ్య భత్యాలు సక్రమంగా ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మున్సి శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సోమి శంకరరావు మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉదయ్ కుమార్, కాకర్ల విజయ్, మంగళగిరి నాని, గణేష్, గోపి, మాడుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.