T- 20 : షమీపై వ్యక్తిగత దూషణలు… అండగా నిలిచిన మాజీ క్రికెటర్లు, ప్రముఖులు

పాకిస్తాన్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక బౌలర్‌ మహ్మద్‌ షమీపై ఆన్‌లైన్‌లో దూషణలు ఎక్కువయ్యాయి. అయితే షమీకి మద్దతుగా నిలిచారు మాజీ క్రికెటర్లు సచిన్‌ టెెండ్కులర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్బన్‌ సింగ్‌. వీరే కాకుండా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ప్రముఖులు సైతం మద్దతు తెలిపారు. భారత్‌ ఓడిన కొన్ని గంటల్లోనే.. పేసర్‌ అయిన షమీని ఉద్దేశించి (11 మంది ఆటగాళ్లలో ఆయన ముస్లిం మతానికి చెందిన వ్యక్తి)… దేశద్రోహి అని, పాకిస్తాన్‌ వెళ్లాలని పరుష పదజాలంతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొందరు దూషణకు దిగారు. వీరే కాకుండా అస్సామీ న్యూస్‌ చానల్‌ ప్రాగ్‌ న్యూస్‌ అయితే.. షమీని ఏకంగా పాకిస్తాన్‌ ఏజెంట్‌ అంటూ.. ఆ క్రికెటర్ల దగ్గర డబ్బు తీసుకున్నాడంటూ.. భయంకరమైన ఆరోపణలు చేసిందని అతడి తరుపు న్యాయవాది అమన్‌ వదూద్‌ ట్వీట్‌ చేశారు. అయితే న్యూస్‌ చానల్‌కు ఎదురు దెబ్బ తగలడంతో ఫేస్‌బుక్‌ పోస్టును తొలగించినప్పటికీ… ట్విట్టర్‌లో పోస్ట్‌ ఇంకా కనిపిస్తూనే ఉంది. సోషల్‌ మీడియా వేదికగా షమీపై కొందరు పనిగట్టుకుని దూషణలకు దిగడంతో.. ఈ చర్యలను ఖండించిన ప్రముఖ మాజీ క్రికెటర్లు.. ఆయనకు సంఘీభావం తెలిపారు. మహమ్మద్‌ అజారుద్దీన్‌, వెంకటేష్‌ ప్రసాద్‌, ఇర్పాన్‌ పఠాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌, సచిన్‌ టెండ్కులర్‌ ఈ జాబితాలో ఉన్నారు.

గెలుపోటములు క్రీడలో ఓ భాగం, షమీపై వ్యక్తిగత దూషణలు దిగడం సరికాదు- అజారుద్దీన్‌

టీమ్‌ ఇండియాకు మద్దతునిచ్చిట్లే… టీమ్‌ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి వ్యక్తికీ మద్దతిస్తాం. షమీ నిబద్ధత కలిగిన అంతర్జాతీయ బౌలర్‌… ఇతర క్రీడాకారుల మాదిరిగానే.. ఆయనకు కలిసిరాలేదు. షమీకి, టీం ఇండియాకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నా : సచిన్‌ టెండ్కూలర్‌

గత 8 ఏళ్లుగా షమీ అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్నారు. ఎన్నో విజయాల్లో ముఖ్యపాత్ర పోషించాడు. ఒక్క మ్యాచ్‌తో అతనేంటో నిర్ధారించకూడదు. నా అభినందనలు షమీకి ఎప్పుడూ ఉంటాయి. ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌కు టీం ఇండియాకు, షమీకి మద్దతుగా నిలవండి- వివిఎస్‌ లక్ష్మణ్‌

ఆన్‌లైన్‌ వేదికగా షమీపై వ్యక్తిగత దూషణలకు దిగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది శోఛనీయం. షమీకి అండగా ఉంటా. అతడో చాంపియన్‌. భారత క్యాప్‌లు ధరించే ప్రతి ఒక్కరూ.. ఆన్‌లైన్‌లో దూషణలకు దిగడం కన్నా హృదయాల్లో భారత్‌ పట్ల అభిమానంతో ఉంటాలి- సెహ్వాగ్‌

ఓడిపోయినందుకు వారు ద్వేషంతో ఉన్నారు. కాబట్టి షమీని ట్రోల్‌ చేస్తున్నారు. వారికి ప్రేమను ఇవ్వడం చేతకాదు. వారిని క్షమించు. షమీ మేమంతా మీతో ఉన్నాం -రాహుల్‌ గాంధీ