తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి
ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన పండుగ. వసంతం అడుగుపెడుతూనే ఉగాదిని కుడా మోసుకురావడం విశిష్టదాయకం. ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఉగాది మన తెలుగువారికి తొలి పండుగ అయింది. సంక్రాంతినాటికి పంట చేతికి వస్తే.. ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవే కావడం వల్ల అవి అంత శోభాయమానంగా వెల్లివిరుస్తాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నిష్క్రమిస్తూ శ్రీ శోభకృత్ ప్రవేశిస్తున్న ఈ శుభ ఘడియలలో తెలుగువారందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన ఉగాది శుభాకాంక్షలు. రైతులు, కార్మికులు, వ్యాపార వాణిజ్యవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. నా సోదర సోదరీమణులందరి జీవితాలు శోభాయమానం కావాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అందరికి శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు.