సబ్ ప్లాన్ అమలులో వైసీపీ వైఖరి మోసపూరితం

•నిధులు దారి మళ్లించి బుకాయిస్తున్నారు
•రెల్లి సమితి నాయకులతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ ప్రభుత్వ వైఖరి కచ్చితంగా మోసపూరితమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. నిధులు దారి మళ్లించింది చాలక అడ్డగోలుగా బుకాయిస్తోందన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు కూడా లేనిపోని నిబంధనలు పెట్టి ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ఆదివారం ఉదయం గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెల్లి సమితి ప్రతినిధులు శ్రీ మనోహర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా రెల్లి సమితి నాయకులు తమ వర్గం సమస్యలు చెప్పుకొన్నారు. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత దక్కలేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని, సబ్ ప్లాన్ నిధులు తమకు చేరడం లేదని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రం కోసం వెళ్తే మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కార్మికుల సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలో ఆయనతో ఓ ప్రత్యేక సమావేశం మంగళగిరి కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు హామీ ఇచ్చారు.
•సమస్యలు చెప్పుకొన్న కృష్ణ బలిజ సంఘం నాయకులు
ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం నాయకులు శ్రీ మనోహర్ గారిని తెనాలిలో కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ వర్గం బలంగా ఉన్న చోట రాజకీయ ప్రాధాన్యత లభించే ఏర్పాటు చేయాలని, అత్యంత వెనుకబడిన కులమైన తమను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చేందుకు కృషి చేయాలని కోరారు. కృష్ణ బలిజల సమస్యలు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తానని ఈ సందర్భంగా మనోహర్ హామీ ఇచ్చారు.

Avatar