జనసేన రైతు భరోసా యాత్ర చూసి ముఖ్యమంత్రి ఓర్వలేకపోతున్నారు

•రాజకీయ ఉపన్యాసాలతో ఎదుర్కోవాలని చూస్తున్నారు
•ఇలాంటి ముఖ్యమంత్రితో సమాజానికి ఉపయోగం లేదు
•రాష్ట్ర రైతాంగం కోసం నిలబడిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
•రైతు కుటుంబాలను ఆదుకోవడంతోపాటు చిన్నారుల చదువులకూ భరోసా ఇస్తున్నారు
•ఎలాంటి సమస్య వచ్చినా మీకు అండగా ఉంటారు
•పర్చూరు కౌలు రైతు భరోసా సభలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది.. రైతాంగంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందనీ అలాంటి వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీదా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పఫ్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ రోజు కూడా ప్రకాశం జిల్లాలో వినోద్ కుమార్ రెడ్డి అనే యువ రైతు ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మరణాలు పట్టకపోగా, వాటిని అవమానపర్చే విధంగా ప్రభుత్వ వేదికలపై మాట్లాడుతున్నారన్నారు. రైతుల కోసం జనసేన పార్టీ కార్యక్రమం చేస్తుంటే ఓర్వలేక రకరకాల ఉపన్యాసాలతో రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడని మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా, పర్చూరులో జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర సభను ఉద్దేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర ఇప్పటికే మూడు జిల్లాల్లో పూర్తి చేసుకున్నాం. అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యటించి రైతాంగం కష్టాలు ఆలకించి, వారిలో భరోసా నింపే క్రమంలో అద్భుతంగా ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం చేపట్టాం. రైతాంగం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అద్భుతంగా రైతులకు ఉపయోగపడే విధంగా యాత్ర చేపట్టాం. ఈ యాత్ర రైతుల్లో ఒక భరోసా నింపేందుకు చేపట్టాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కూడా వంకాయలపాడులో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అది తట్టుకోలేక ఆయన భార్య కూడా అదే పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఇవేమీ పట్టడం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 132 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పులివెందులలో 13 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రకాశం జిల్లాలో పార్టీ దృష్టికి వచ్చిన అర్జీలు, సేకరించిన సమాచారం మేరకు శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 84 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో 72 కుటుంబాలకు ఈ రోజు ఈ సభా వేదిక మీద ఆర్ధిక సాయం చేయబోతున్నాం. ఉదయం నుంచి రెండు కుటుంబాలను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబాల స్థితిగతులు, బిడ్డల భవిష్యత్తు గురించి తెలుసుకున్నారు. ఆ కుటుంబాల్లో చదువుకోవాలనుకుంటున్న చిన్నారులకు పూర్తి స్థాయి భరోసా ఇచ్చే విధంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
* ఎవరూ అధైర్య పడవద్దు
ఈ వేదిక నుంచి మరోసారి చెబుతున్నాం జగన్ రెడ్డికి నిజాయితీ ఉంటే, రైతాంగం కోసం మనసుతో పని చేసే వ్యక్తి అయితే, ఆయనకు నిజంగా పరిపాలనా దక్షత ఉంటే రైతుల కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సభకు వచ్చి రైతుల కన్నీరు, కష్టాలు, ప్రభుత్వం నుంచి ఆదుకోని పరిస్థితులు తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అధైర్యపడవద్దు. ప్రతి గ్రామంలో మా జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మా నాయకులు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వారి దృష్టికి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు స్పందించి మీకు అండగా నిలుస్తారు” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, పార్టీ నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, డా. గౌతమ్ రాజ్, ఇమ్మడి కాశీనాథ్, కంచర్ల శ్రీకృష్ణ, బొటుకు రమేష్, పులి మల్లికార్జున్, శ్రీమతి రాయపాటి అరుణ, మలగా రమేష్, రాయపాటి ప్రసాద్, కందుకూరి బాబు, వరికూటి నాగరాజు, శ్రీమతి బొందిల శ్రీదేవి, చిట్టెం ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.