ముఖ్యమంత్రి అజ్ఞానంతో విమర్శలు చేస్తున్నారు

* వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
* జనసేన దగ్గర ఆధారాలున్నాయి…. దమ్ముంటే మా లెక్కలు తప్పని నిరూపించండి
* వ్యవసాయ రంగంపై రూ. లక్షా 27 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు?
* ప్లీనరీలో సీఎం చెప్పినవి పచ్చి అబద్ధాలు
* 16న మండపేటలో జనసేన కౌలు భరోసా యాత్ర
* 60 కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం
* కాకినాడ మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానంతో.. అంధకారంలో కూరుకుపోయి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తప్పుబట్టారు. అప్పుల పాలైన కౌలు రైతుల ఆత్మహత్యలపై పత్రికల్లో తరచూ కథనాలు వస్తున్నా… స్థానికంగా పోలీస్ స్టేషన్లలో అందుకు సంబంధించిన కేసులు నమోదవుతున్నా … చనిపోయిన వాళ్లు అసలు కౌలు రైతులే కాదు, వాళ్ల దగ్గర సరైన ఆధారాలు లేవని పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడం బాధిత కుటుంబాలను అవమానపరచడమేనన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 16వ తేదీన మండపేటలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సాగు నష్టాలు తట్టుకోలేక అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ 60 మందికి పైగా కౌలు రైతు కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. ఆర్థిక సాయం అందుకోనున్న వారిలో ఎవరైనా కౌలు రైతు కుటుంబం కాదని నిరూపించే దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా? అని సవాల్ విసిరారు. గురువారం ఉదయం కాకినాడ హల్కంటైన్స్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కౌలు రైతు ఆత్మహత్యలపై పత్రికల్లో కథనాలు రావడం, జనసేన పార్టీ యాత్ర చేయడంతో మొత్తానికి ప్రభుత్వం కదిలివచ్చి కౌలు రైతు ఆత్మహత్యలు నిజమేనని ఒప్పుకొంది. అయితే ఆత్మహత్యలకు పాల్పడింది 850 మంది మాత్రమేనని వ్యవసాయశాఖ కమిషనర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకున్నారు. వాళ్లు చెబుతున్న లెక్క ప్రకారం 850 మందే ఆత్మహత్య చేసుకున్నారు అనుకుందాం… వాళ్లందరికీ ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల నష్టపరిహారం అందిందా? ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించిందా? అంటే అదీ లేదు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం చనిపోయిన వాళ్లు అసలు కౌలు రైతులే కాదు, వాళ్లకు సీసీఆర్సీ కార్డులు లేవు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు అంటూ మాట్లాడుతున్నారు.
* మీ నిజాయతీ… మా నిజాయతీ తేల్చుకుందాం రండి
జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రతి ఒక్క అధికారిని ప్రశ్నిస్తున్నాం. సలహాదారులు, అధికారులే ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు? సంబంధిత శాఖ మంత్రులు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? సంబంధిత శాఖ మంత్రో, ముఖ్యమంత్రో స్పందిస్తే ప్రజలకు స్పష్టత వస్తుంది కదా. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన నివేదిక, సమాచార హక్కు చట్టం ద్వారా మా పార్టీ నాయకులు సేకరించిన వివరాల ఆధారంగా మేము మాట్లాడుతున్నాం. గతంలో కూడా ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేశాం. జనసేన పార్టీ ఆర్థిక సాయం అందిస్తున్న ఏ ఒక్క కుటుంబం అయినా ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబం కాదని నిరూపించే దమ్ముందా అని సవాల్ చేశాం. పర్చూరు సభకు కూడా ఆహ్వానించాం. ఆయన రాలేదు. ఇప్పుడు మండపేట సభకు ఆహ్వానిస్తున్నాం. ఆ సభకు వస్తే వైసీపీ చెబుతున్న లెక్కల్లో నిజాయతీ ఉందా? లేక జనసేన, శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో నిజాయతీ ఉందా? తేలిపోతుంది. జనసేన పార్టీకి ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపాలనే ఆలోచన తప్ప… వైసీపీలా ఓట్లు కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం లేదు.
* 19 శాతం మందికే సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు
2016నాటి ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారని అంచనా. ఈ రోజుకు ఆ సంఖ్య సుమారు 30 లక్షలకు చేరింది. కౌలు రైతులకు సాయం అందించాలని 2011లో అప్పటి ప్రభుత్వం భూ అధీకృత సాగుదారు చట్టం తీసుకొచ్చింది. దీని ద్వారా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసేవారు. ఆ కార్డు పొందాలంటే యజమాని అంగీకారం అవసరం లేకుండా రెవెన్యూ అధికారులే కౌలు రైతుల్ని గుర్తించి కార్డులు మంజూరు చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పాత కౌలుదారుల చట్టాలు రద్దు చేసి.. 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్‌సీ) ఇస్తామని ప్రకటించారు. ఐతే…ఈ సీసీఆర్‌సీ కార్డులు పొందాలంటే.. 11 నెలలకు సంబంధించిన కౌలుపత్రాలపై.. భూ యజమానితో సంతకం చేయించుకోవాలని నిబంధన పెట్టారు. వాటితో పాటు రైతు ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని ఈ-క్రాప్ విధానంలో స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే కౌలు రైతుగా పరిగణిస్తామని చెప్పారు. అయితే ఒప్పంద పత్రాలపై ఎక్కువ మంది రైతులు సంతకాలు చేయకపోవడంతో చాలా మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులు రాలేదు. ప్రభుత్వం కూడా కేవలం 5 లక్షల 36 వేల మందికే సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 19 శాతం మందికే సీసీఆర్సీ కార్డులు అందాయి.
* అంత ఖర్చు చేస్తే ఎందుకీ ఆత్మహత్యలు?
మొన్న జరిగిన వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి గారు ఎన్నో అసత్యాలు మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో వ్యవసాయ రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేశాం. ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆర్‌బీకేల ద్వారా రైతన్నల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం అంటూ మాట్లాడారు. ఆయన నిజంగా రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇంతమంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం ఎందుకు రెండో స్థానంలో నిలబడుతుంది? నిజంగా అంత సొమ్ము ఒక్క వ్యవసాయ రంగం మీదే ఖర్చు చేసి ఉంటే ఈపాటికి ఎంతో అభివృద్ధి జరిగేది. లక్షలాది మందికి ఉపాధి కలిగేది.
* హడావుడిగా ఖాతాల్లో లక్ష వేస్తున్నారు
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు హడావుడిగా రూ. లక్ష ఖాతాల్లో వేస్తున్నారు. వీఆర్వో, తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులను గ్రామ గ్రామాల్లో తిప్పి మీకు బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే నష్టపరిహారం సొమ్ము పడుతుందని, ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్లకండి అని చెప్పిస్తున్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకంత భయం? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాల్లో రూ. 7 లక్షలు జమ చేయాలి. అంతేతప్ప హడావుడిగా అధికారులతో లక్ష వేయడం కాదు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు యాత్ర మొదలవుతుంది. కొన్ని కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్లి లక్ష రూపాయలు ఆర్థికసాయం అందిస్తారు. మిగిలిన అన్ని కుటుంబాలకు మండపేట బహిరంగ సభలో చెక్కులు అందిస్తారు. ఇప్పటికే ఈ సభకు రైతులు, మహిళలు రాకుండా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా సభను విజయవంతం చేస్తాం.
రాష్ట్రంలో రహదారులు దుస్థితి గురించి ముఖ్యమంత్రిని నిద్ర లేపాలి. అందుకోసమే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ మొదలుపెడుతున్నాం. 15, 16, 17 తేదీల్లో సోషల్ మీడియా ద్వారా రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలియచేస్తామ”న్నారు. అంతకుముందు భారీ వర్షాలు, వరదలను కవర్ చేయడానికి వెళ్లి గల్లంతై చనిపోయిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు మేడా గురుదత్ ప్రసాద్, పోలిశెట్టి చంద్రశేఖర్, తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాస్, మాకినీడి శేషుకుమారి, పార్టీ నాయకులు సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివప్రసాద్, బోడపాటి శివదత్, శ్రీమతి ముత్యాల జయలక్ష్మి, శ్రీమతి సుంకర కృష్ణవేణి, శ్రీమతి శిరీష తదితరులు పాల్గొన్నారు.
* జనసేనలోకి మామిడికుదురు టీడీపీ నేతలు
రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు గురువారం కాకినాడలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీ, సొసైటీ ప్రెసిడెంట్ ఈలి జగన్నాథరావు, రామకృష్ణ ప్రసాద్, రాంబాబు, కటకంశెట్టి రామకృష్ణ ప్రసాద్, జెల్లి రమణ, ఉండ్రాజవరపు నాగబాబు, చిత్తా ఏసు, తమ్మిడి సత్తిబాబు, ముస్కుడి మురళీ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు.