ముఖ్యమంత్రి అసత్యాలతో అన్ని వర్గాలనూ మోసగిస్తున్నారు

•రైతుల ఆత్మహత్యల్ని అవహేళన చేస్తున్నారు
•ఈ ప్రభుత్వాన్ని పారదోలాల్సిన సమయం ఆసన్నమైంది
•16న మండపేటలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
•ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
• వేట్లపాలెంలో క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ పరామర్శ
•రూ. 5 లక్షల చెక్కు అందచేత

నిత్యం అసత్యాలతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల తాలూకు కుటుంబాలను ఆదుకోకపోగా వారిని అవహేళన చేస్తున్నారన్నారు. రైతాంగానికి భరోసా నింపేందుకు ఈ నెల 16న మండపేటలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ముఖ్యమంత్రికి నిజంగా రైతుల సంక్షేమం పట్ల నిజాయతీ ఉంటే పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం జనసేన పార్టీ చేస్తుందన్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గం, వేట్లపాలెం గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుడు దంగేటి మంగారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగారావు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య శ్రీమతి రామలక్ష్మి, కుమారులను మనోహర్ గారు ఓదార్చారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు అందించే రూ. 5 లక్షల చెక్కును ఆమెకు అందచేశారు. భవిష్యత్తులోనూ పార్టీ తరఫున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యులుగా భావించి ఆపదలో మేమున్నామన్న భరోసా ఇచ్చే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, పార్టీ నాయకులు తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాస్, డీఎంఆర్ శేఖర్, శ్రీమతి నాగమానస తదితరులు పాల్గొన్నారు.