రాష్ట్రంలో ప్రతి రైతుకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి

•అర్హత లేని రైతులు అంటూ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి
•ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రైతాంగాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి
•మీ చట్టంలో లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆరోపణలు
•చిత్తశుద్ధి ఉంటే మాతో ప్రతి రైతు ఇంటికీ రండి
•జనసేన సాయం పొందిన రైతుల అర్హత ఏమిటో తెలుస్తుంది
•ఎవరి నిజాయితీ ఏంటో బయటపడుతుంది
•ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ ఆరోపణలకు వేదికగా మార్చారు
•జనసేన పార్టీ ఇప్పటికి 200 పైచిలుకు కుటుంబాలకు సాయం చేసింది
• ప్రతి రైతు కుటుంబాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదుకుంటారు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రైతాంగం గురించి, వారి సమస్యల గురించి, వ్యవసాయం గురించి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చే విధంగా ఉన్నాయి. జనసేన సాయం చేసిన రైతుల ఇళ్లకు వెళ్తే అర్హత లేని రైతులు ఎవరో? ఎవరిలో నిజాయితీ ఉందో బయట పడుతుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుని, వారిలో భరోసా నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచిలుకు కుటుంబాలను ఆదుకుని రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించాం. ఈ నెల 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారికి భరోసా నింపుతారు. ప్రజలు కూడా ఎవరి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి.
•వైసీపీ వచ్చాక 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి అనంతపురంలో నిన్న జరిగిన సభలో రైతాంగానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా వ్యక్తిగత ఆరోపణలకే పరిమితం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రైతాంగం సమస్యల్లో ఉన్న ప్రతిసారి వారికి అండగా నిలబడుతూ వచ్చారు. తుపాన్లు వచ్చినప్పుడుగాని, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల వ్యవహారంలోనూ రైతుల పక్షాన నిలిచి బాధ్యతగల రాజకీయ పక్షంగా అన్నదాతల్లో ఓ భరోసా నింపారు. రైతుల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఊహించని విధంగా ఉంది. రైతు స్వరాజ్య వేదిక, రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యం కలిగించింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సుమారు 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల గురించి మాట్లాడే వ్యక్తిగాని, ఆ కుటుంబాలను ఆదుకునే వ్యక్తిగాని లేడు. ప్రభుత్వం, ముఖ్యమంత్రికి కనీసం స్పందించే మనస్తత్వం లేదు.
•కడప జిల్లాలో 132 మంది ఆత్మహత్య
ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆదర్శవంతంగా అందరికంటే ముందుగా స్పందించి తన సొంత నిధులు రూ. 5 కోట్లు పార్టీకి విరాళంగా ఇచ్చారు. ప్రతి రైతు కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా జిల్లాల్లో పర్యటించి రూ. లక్ష ఆర్ధిక సాయం అందించే విధంగా గొప్ప నిర్ణయం తీసుకుని యాత్ర ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు, పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం రైతాంగానికి హామీలు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రాంతంలో అటువంటి పరిస్థితి ఉండదని భావించాం. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలు పరిశీలిస్తే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది, సొంత జిల్లా కడపలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా మీలో నిజాయతీ ఉంటే రైతుల్ని అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. జనసేన పార్టీ చిత్తశుద్దితో పారదర్శకంగా ప్రతి రైతు కుటుంబానికి ఒక భరోసా నింపి వారి బిడ్డల్ని ఆదుకునే విధంగా, వారికి భవిష్యత్తు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాల మీద లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఆ కుటుంబాలన్నింటినీ జనసేన పార్టీ ఆదుకుంటోంది.
• జగన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాం..
శ్రీ జగన్ రెడ్డి…. మీరు ప్రవేశపెట్టిన చట్టంలోని లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికే అర్హత లేని రైతులు అని మాట్లాడుతున్నారు. నేను శ్రీ జగన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రండి ప్రతి రైతు ఇంటికీ వెళ్దాం. ఏ రైతుని అయితే మేము ఆదుకుని రూ. లక్ష ఇచ్చామో, అర్హత లేని రైతులు అంటూ ఏ రైతుని అయితే అన్నారో ఆ కుటుంబాలను కలసి వెళ్లి పరామర్శిద్దాం. ఎవరి నిజాయితీ ఏంటో బయట పడుతుంది. పవన్ కళ్యాణ్ గారి జిల్లా పర్యటన అనగానే హడావిడిగా రాత్రికి రాత్రి మీ ప్రభుత్వం నుంచి బాధితుల ఖాతాల్లో రూ. లక్ష ఎందుకు వేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు మీ ప్రభుత్వం నుంచి రూ. 7 లక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి బాధలో నలిగిపోయి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అర్జీలతో చనిపోయిన వ్యక్తి కాగితాలు తీసుకుని తిరిగితే, చాలా సందర్భాల్లో 8 నెలలు గడచినా కనీసం ఆ కుటుంబాల్లో మహిళలకు ఫించన్లు కూడా ఇవ్వటం లేదు. అలాంటి కుటుంబాలను ఇంటింటికీ వెళ్లి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తుంటే, ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయ వేదికలుగా మార్చుకుని విమర్శలు చేస్తారా? జనసేన పార్టీ దగ్గర ఉన్న లెక్కలు మీకు అందచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్నీ రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ లో ఉన్న రిపోర్టు మేరకు, పోస్టుమార్టం రిపోర్టు సహా క్రోడీకరించాం. మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇది వాస్తవం. ప్రతి రైతునీ ఆదుకునే విధంగా మీరు స్పందించాలి. ప్రతి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి. మీరు ప్రవేశపెట్టిన కౌలుదారుల హక్కు చట్టం వల్లే ఈ రోజు రైతాంగానికి ఇంత నష్టం జరిగింది. ఆ చట్టంలోని లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికే మీరు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. భూ యజమాని దగ్గర నుంచి 11 నెలల అగ్రిమెంట్ క్లాజ్ పెట్టింది మీరు కాదా? విత్తనాల సబ్సిడి ఏ కౌలు రైతుకు వచ్చింది? ఎరువుల సబ్సిడి ఏ రైతుకు వచ్చింది? రైతు భరోసా కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ రైతుని ఆదుకునే నాధుడు ఎవరు? కేవలం రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నాయకులకే పరిమితం అయ్యాయి. ఈ ప్రభుత్వం ఎక్కడా రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. కష్టాల్లో ఉన్న రైతాంగానికి పెద్ద దిక్కుగా కన్నీరు తుడవాల్సిందిపోయి ఆరోపణలు చేస్తూ పబ్బం గడపడానికి మించి దారుణమైన పరిస్థితి ఏముంటుంది.
•కౌలు రైతులు పాసు పుస్తకం ఎక్కడి నుంచి తెస్తారు
ఈ ముఖ్యమంత్రికి ఒక్కటే చెబుతున్నాం. నూటికి నూరు శాతం మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల్ని పరామర్శిస్తారు. ఆ కుటుంబాలకు ఆర్ధిక భరోసాతో పాటు మనోధైర్యం కల్పించే విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుని జనసేన పార్టీ తరఫున లక్ష ఆర్ధిక సాయం ఇస్తారు. ప్రభుత్వంలో చిత్తశుద్ది ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట మేరకు ప్రతి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందించాలి. కౌలు రైతు పట్టాదారు పాసు పుస్తకం ఎక్కడి నుంచి తెస్తారు. ఏ భూ యజమాని వారికి ఇస్తారు. అదొక షరతుగా పెట్టారు. రండి తేల్చుకుందాం. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పరామర్శిద్దాం. జనసేన పార్టీ కేవలం సమాజానికి ఉపయోగపడే విధంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వం అంటే ఒక పార్టీకో, కుటుంబానికో ఉపయోగపడే విధంగా పని చేయడానికి మేము సిద్ధంగా లేము. దయచేసి మీరు చేస్తున్న ఆరోపణలు మానుకోండి అని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.